విశాఖజిల్లాలోని గ్రీన్ జోన్లలో ప్రజల కదలికలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనుమతి లేకుండా విచ్చలవిడిగా ప్రయాణాలు సాగిస్తుండటంతో, మండలాల సరిహద్దులను మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘించి బోర్డర్లు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయి.

 

లాక్ డౌన్ ను విశాఖ రూరల్ జిల్లా పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అంతర్ జిల్లా చెక్ పోస్టుల నిర్వహణలో రాజీలేని ధోరణి ప్రదర్శించడమే కాదు, ఇప్పుడు మండలాల సరిహద్దులపైన దృష్టి సారించారు. జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు, అనకాపల్లి పరిధిలోని జీవీఎంసీ వార్డులు మినహా మిగిలిన ప్రాంతం గ్రీన్ జోన్ల పరిధిలోనే ఉంది. 34మండలాల్లో లాక్డౌన్ నిబంధనలు మేరకు మినహాయింపులు అమలులోకి వచ్చాయి. 

 

అయితే పని వున్నా లేక పోయినా జనం బయటకు వస్తున్నారు. మండలాలు దాటి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ చర్యల వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు...నిబంధనలను కట్టుదిట్టం చేశారు. మండలాల సరిహద్దుల్లోని గ్రామాలను పోలీసులు మూసివేస్తున్నారు. రోడ్లకు అడ్దు గా చెట్లు, మట్టికట్టలు వేస్తున్నారు. 

 

చోడవరం-మాడుగుల మండలాల బోర్డర్లో మట్టికుప్పలు, కర్రలు పెట్టి రాకపోకలు నిషేధించారు. ఇప్పటికే ఏజెన్సీలోని 11గిరిజన మండలాల్లో కి మైదాన ప్రాంతం నుంచి రాకపోక లపై ఆంక్షలు ఉన్నాయి. అత్యవసర సేవలు, అనుమతి పొందిన వారు తప్ప ఇతరులు ప్రవేశిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మండలాల మధ్య సరిహద్దులను కూడా మూసేస్తున్నారు. 

 

జనం రాకపోకలు నియంత్రించడానికి సరిహద్దులు మూసివేయడమే మార్గమని భావించిన అధికారులు కింది స్థాయి సిబ్బందికి ప్రత్యేకమైన సూచనలు విడుదల చేశారు.అత్యవసర సేవలు,పంట రవాణా, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. మండలాల మధ్యలో ప్రధాన ప్రాంతాల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి,  రాకపోకలు నియంత్రిస్తున్నారు.

 

ఇక లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించే వారిని ఏమాత్రం ఊపేక్షించడం లేదు. మండలాల బోర్డర్లు మూస్తేనే.. వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకట్టవేయోచ్చని అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: