కొన్ని రోజుల క్రితం గత 100 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులు రాలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులకు దర్శనాలు ఆపేసి 45 రోజులైందని... దాదాపు 175 కోట్ల రూపాయలు నష్టపోయామని తెలిపారు. దర్శనాలు ఆపివేయడంతో ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని గతంలో టీటీడీకి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదని అన్నారు. రాబోయే కాలంలో టీటీడీ ఖర్చులు, వ్యయాలు తగ్గించే విషయమై అధికారులు, ఉద్యోగులు, పాలకమండలి సభ్యులు సహకరించాలని చెప్పారు. 
 
టీటీడీ ఛైర్మన్ చేసిన ఈ ప్రకటనపై కొందరు నాస్తికులు ఒక నెల భక్తులు లేకపోతే ఆలయాల బతుకు భారమైందా...? అని ప్రశ్నించారు. వేల సంవత్సరాలుగా ఎవరు ఎవరిని పోషిస్తున్నారని.... ఎవరి వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుందని ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది. గతంలో నాస్తికులు ఆలయాల వల్ల ప్రయోజనం ఏమిటి..? అని ప్రశ్నించారు. 
 
సాధారణంగా మనకు మానసిక సమస్యలు ఎదురైనా, ప్రశాంతత కావాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా ప్రార్థనా మందిరాలకు చేరుకుంటాం. దేవున్ని నమ్మే ఎవరైనా ఎటువంటి సమస్య వచ్చినా దేవుడు పరిష్కారం చూపిస్తాడని భావిస్తారు. ఎవరైనా మానసిక సాంత్వన కొరకు దేవుడి దగ్గరకు వెళి దేవుడే తమకు తోడుగా ఉన్నాడని నమ్మి విజయం సాధించేవారు ఎంతో మంది ఉన్నారు. 
 
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తులు దేవుడిపై భక్తితో నగదు రూపంలో, ఇతరత్రా వస్తువుల రూపంలో కానుకలు సమర్పిస్తారు. కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ దేవాలయంలో ఎవరూ ఏమీ అనరు. ప్రార్థనా మందిరాల్లో ధనం ఉన్నవాళ్లకు, లేనివాళ్లకు అందరికీ దర్శనం ఉంది. చాలా చోట్ల ఈ దేవాలయాలు విద్యాలయాలకు, ఇతర సంస్థలకు, పేదవారికి సహాయసహకారాలు అందిస్తున్నాయి. 
 
ఆస్పత్రుల ద్వారా ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నాయి. ఈ దేవాలయాల ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వేల మంది ఉపాధి పొందుతున్నారు. విజ్ఞానాన్ని అభిమానించడంలో తప్పు లేదు... అదే సమయంలో నమ్మకం ఉండటంలో తప్పులేదు. అధ్యాత్మికతను ద్వేషంతోనే చూడాల్సిన అవసరం లేదు. మూడ నమ్మకాన్ని, మూర్ఖత్వాన్ని ద్వేషించడంలో తప్పు లేదు కాన్నీ నమ్మకాన్ని ద్వేషించడం మాత్రం తప్పనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: