మనస్సు ఉంటే మార్గం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ అధికారులు మరోసారి నిరూపించారు. విద్యుత్ రంగంలో మిగులు ఉన్న వేళ.. దాన్ని చౌకగా కొనడం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని మిగిల్చారు. ఏపీ అధికారులు ఈ ఏప్రిల్‌లో 824.88 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ను కొనుగోలు చేశారు. ఇందుకోసం ఏపీ ఈఆర్‌సీ అనుమతించిన ధర యూనిట్ కు రూ.1.60. అయితే ఏపీ అధికారులు మాత్రం అంత కంటే తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేశారు.

 

 

ఇందుకు విద్యుత్ శాఖ అధికారులు పక్కా ప్లాన్ వేసుకున్నారు. మార్కెట్‌ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసు కుంటున్నారు. పీపీఏలున్న విద్యుత్ సంస్థల ధరలకు.. మార్కెట్లో లభించే విద్యుత్‌ ధరలను పోల్చుకుంటున్నారు. ఎక్కడ తక్కువకు విద్యుత్ లభిస్తే అక్కడే కొంటున్నారు. ఇందుకోసం వారు అధికారులతో ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకున్నారు.

 

 

ఇప్పుడు వారి ప్రయత్నాలు ఫలించాయి. దీనివల్ల ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ.132 కోట్లు ఆదా చేయగలిగారు. మరోవైపు దీని వల్ల మరో మేలు కూడా జరిగింది. చౌక విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేశారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో బొగ్గు నిల్వలు ఆదా అయ్యాయి. వాటిని కష్టకాలంలో ఉపయోగించుకునే అవకాశం కూడా లభించింది.

 

 

ఇలా పక్కా ప్లానింగ్ తో సమయస్ఫూర్తితో వ్యవహరించిన ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబును ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి అభినందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడానికి ఇలాంటి కృషి జరగాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అధికారులను ప్రశంసించారు. నిజంగా అధికారులు మనసు పెట్టి పని చేయాలే కానీ.. ఇలాంటి అద్భుతాలు చాలా చేయగలుగుతారు మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: