ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నుంచి మూడో విడత రేషన్ పంపిణీ జరగనుంది. ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ వల్ల సామాన్యులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారని భావించి ఉచితంగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తోంది. ఇప్పటికే సరుకులు రేషన్ షాపులకు చేరుకోగా మే నెల 10వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరగనుంది. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రంలో ఉచిత సరుకుల పంపిణీ జరుగుతోంది. 
 
పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో కొన్ని సూచనలు చేశారు. డీలర్లు, రెవిన్యూ అధికారులకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించారు. ఉచిత సరుకులు తీసుకునే లబ్ధిదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈరోజు నుంచి మే నెల 10వ తేదీ వరకు బియ్యం, కంది బేడలు ఉచితంగా పంపిణీ చేస్తారు  
 
టైమ్ స్లాట్ విధానం ద్వారా 30 మంది లబ్ధిదారులకు టోకెన్లు పంపిణీ చేసేలా గ్రామ, వార్డ్ వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులు సోషల్ డిస్టన్స్ పాటిస్తూ రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులు కొన్ని ప్రాంతాలలో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. రేషన్ దుకాణాల దగ్గర, అదనపు కౌంటర్ల దగ్గర మాస్కులు, సబ్బులు, శానిటైజర్లు, నీళ్లు అందుబాటులో ఉంటాయి. 
 
ఎవరికైనా రేషన్ అందకపోయినా... రేషన్ అందడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా 1902 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రంలో పలు చోట్ల జనం గుంపులు గుంపులుగా గుమికూడటంతో ప్రభుత్వం టైం స్లాట్ విధానాన్ని తీసుకొచ్చింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 82 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1259కు చేరింది.     
 

మరింత సమాచారం తెలుసుకోండి: