ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌తేడాది అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే త‌న సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతి దూరంగా ఉండాల‌ని.. ఈ విష‌యంలో ఎవ్వ‌రు తేడా చేసినా స‌హించ‌న‌ని వార్నింగ్‌లు ఇచ్చారు. పార్టీ అధినేత‌, సీఎం హోదాలో స్వ‌యంగా ఆయ‌నే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే కేబినెట్ మీటింగుల్లో త‌న మంత్రుల‌కు ఆయ‌నే స్వ‌యంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఒక‌రిద్ద‌రు మంత్రులు, కొంద‌రు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే అవినీతి ఆరోప‌ణ‌ల్లో చిక్కుకోగా వారికి వార్నింగ్‌లు వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు త‌న సొంత పార్టీకే చెందిన ఎంపీకే జ‌గ‌న్ అదిరిపోయే షాక్ ఇచ్చార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన ఎంపీ కుటుంబంపై వచ్చిన అక్రమాల ఆరోపణలపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది.

 

విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎంపీ డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కుటుంబం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. సత్యవతి భర్త డాక్టర్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో వివేకానంద ఛారిటబుల్ ట్రస్టు పనిచేస్తోంది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ ట్ర‌స్టుకు కూడా నిత్యావ‌స‌రాలు అంద‌డం లేద‌ట‌. దీంతో ప్ర‌భుత్వ రేష‌న్ దుకాణాల‌కు వెళ్లాల్సిన బియ్యాన్ని నేరుగా ఎంపీ ఇంటికి స‌మీపంలోని ట్ర‌స్టు కార్యాల‌యానికి ఓ వాహ‌నంలో త‌ర‌లించిన‌ట్టు అధికారులు గుర్తించారు. ఈ విష‌యం తెలిసిన జేసీ, ఆర్డీవో రెవెన్యూ, పోలీసుల స‌మ‌క్షంలోనే విచార‌ణ చేసి 500 కేజీలు ఎంపీ కుటుంబ ట్రస్టుకు అక్రమంగా తరలివెళ్తున్నట్లు తేల్చారు. 

 

ఇందుకు కారణమైన ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ ఛార్జ్ తో పాటు ఓ రేషన్ డీలర్ ను సస్పెండ్ చేశారు. అక్రమాలు తేలడంతో ఎంపీ కుటుంబానికి చెందిన ట్రస్టుపై 6ఏ కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు. క‌రోనా స‌మ‌యంలో పేద‌ల‌కు అందాల్సిన బియ్యం ఎంపీ కుటుంబ అవ‌స‌రాల‌కు వాడ‌డంతో ముందు ఎంపీ కుటుంబంపై కేసు పెట్టాలా ? వ‌ద్దా ? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డినా చివ‌ర‌కు జ‌గ‌న్‌కు ఈ స‌మాచారం తెలియ‌జేసి కేసు పెట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఏద‌మైనా అవినీతి, అక్ర‌మాల విష‌యంలో ఎంత‌టి వారు అయినా జ‌గ‌న్ స‌హించ‌ర‌న్న‌ది మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: