గుజరాత్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న ఏపీ మత్స్యకారుల తరలింపు ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది.  నాలుగు వేలకు పైగా మత్స్యకారులు రేపు స్వస్థలాలకు చేరుకోనున్నారు. వారికి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం.

 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిడంతో ఉత్తరాంధ్రకు చెందిన నాలుగు  వేలమందికి పైగా మత్స్యకారులు.. గుజరాత్‌లోని వీరావల్‌లో చిక్కుకుపోయారు. జెట్టీలోనే వాళ్లు నెల రోజులుగా కాలం గడుపుతున్నారు. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న మత్స్యకారులను.. అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో..  ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో బాధితుల తరలింపుకు ఏర్పాట్లు జరిగాయి. ఒక్కో బస్సు లో 76 మంది చొప్పున  36 బస్సుల్లో వీరు సొంత ఊళ్లకు చేరుకోనున్నారు. ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల తరలింపు కోసం  3 కోట్లు కేటాయించింది. రేపు వారు సొంతగడ్డపై అడుగుపెట్టనున్నారు.


   
స్థానిక అధికారులు జాలర్లందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి పాస్‌లు ఇవ్వగా మొదటి విడతగా  శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిని తరలివస్తున్నారు.    మార్గమధ్యంలో ఎక్కడా ఆహారం దొరకదు కాబట్టి, మత్స్యకారులకు ఇబ్బందిలేకుండా డ్రై ఫ్రూట్స్  తో కూడిన   పౌష్టికాహారపు ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.  ఎలాంటి అవాంతరాలు లేకుండా సమన్వయం చేసుకొంటూ, సజావుగా ప్రయాణం సాగేందుకు ఒక్కో బస్సులో రాష్ట్ర అధికారిని పంపుతోంది గుజరాత్ ప్రభుత్వం.  ఏపీ ప్రభుత్వ సూచనల మేరకు మత్స్యకారుల స్వస్థలాలకే బస్సులు వెళ్లనున్నాయి. వీరందరికీ పరీక్షలు చేసిన అనంతరమే బస్సుల్లోకి ఎక్కించింది గుజరాత్ అధికారుల బృందం.


 
గుజరాత్, ఏపీ రాష్ట్రాలు సమన్వయంతో మొత్తం 3 వేల 800 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వస్థలాలకు తరలిస్తున్నారు.  మిగిలిన వారందరినీ మరో 15 బస్సులలో ఈ రోజు తరలింపు ప్రక్రియ చేపట్టారు. ఎట్టకేలకు ఏపీ మత్స్యకారులు తమ ఇళ్లకు చేరుకోనుండటంతో వారి కుుటంబాలు ఆనందంలో మునిగిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: