ప్రభుత్వ నిబంధనలు, అధికారుల వేధింపులను నిరసిస్తూ బంద్ చేపట్టాలని తెలంగాణలో లారీ యజమానులు భావిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజల అవసరాల కోసం సరుకు రవాణా చేస్తున్న వాహనాలను నిలిపివేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని అశ్రయించే ఆలోచనలో ఉన్నారు. 

 

తెలంగాణ వ్యాప్తంగా నిత్యావసరాలు, ధాన్యం, ఇతర సరుకులు రవాణా చేస్తున్న లారీలు, డీసీఎంలను నిలిపివేయాలని దాదాపు నిర్ణయించింది ఓనర్స్‌ అసోసియేషన్‌.  లాక్​డౌన్​ కారణంగా వాహనాలు రోడ్డెక్కడమే లేదని, అలాంటిది క్వార్టర్లీ ట్యాక్స్​ ఎట్లా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి క్వార్టర్లీ ట్యాక్స్​ను మాఫీ చేయాలని, లేకుంటే ఈ నెల 30 నుంచి సరుకు రవాణాను కూడా నిలిపివేస్తామని అంటున్నారు.  ప్రభుత్వం మొండిగా ముందుకెళితే కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఆదాయం తగ్గిపోయిన కారణంగా ట్యాక్స్‌‌ మాఫీకి సర్కారు సుముఖంగా లేదని అధికారులు చెప్తున్నారు. లాక్​డౌన్​ మొదలైన మార్చి 23న లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తర్వాత లాక్‌‌ డౌన్‌‌ పొడిగించడంతో డ్రైవర్లు వాహనాలు వదిలేసి ఇళ్లుకు వెళ్లిపోయారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సరుకు రవాణాకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తంగా లక్షా 70 వేల లారీలు, డీసీఎంలు ఉండగా.. ప్రస్తుతం అందులో 20 శాతమే నడుస్తున్నాయి. దాదాపు అన్ని రకాల గూడ్స్‌‌ వాహనాలను నడుపుకోవడానికి కేంద్రం అనుమతిచ్చినా  తెలంగాణ మాత్రం సడలించలేదు. అత్యవసర సరుకులు మాత్రమే రవాణా అవుతున్నాయి.

 

వాణిజ్యపరంగా వినియోగించే వాహనాల ​ఓనర్లు ప్రతి మూడు నెలలకోసారి రవాణా శాఖకు క్వార్టర్లీ ట్యాక్స్‌‌ చెల్లించాల్సి ఉంటుంది.  ప్రస్తుతం లాక్​డౌన్​ ఉండటంతో నెల రోజులకు పైగా చాలా వరకు వాహనాలు తిరగడం లేదు.  ఇలాంటి పరిస్థితిలో ట్యాక్స్‌‌ ఎలా కట్టాలని ఓనర్లు అంటున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఆర్టీఏ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో లారీలకు మాఫీ చేస్తే, ఇతర ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వెహికల్స్​ కూడా డిమాండ్‌ చేస్తారన్నది అధికారుల అనుమానం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం ఆరు లక్షల వరకు ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వాహనాలు ఉన్నాయి.

 

జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటి వరకు మెజార్టీ లారీలు షెడ్డులకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వ అవసరాల కోసం కొన్ని తిరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ వేళ తమ పరిస్థితిని అర్ధం చేసుకుని ట్యాక్స్‌ మాఫీ చేయాలని యజమానులు కోరుతున్నారు. లేదంటే తిరిగే వాహనాలను నిలిపేస్తామని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే సరుకు రవాణాపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: