తెలంగాణ‌లో లాక్‌డౌన్ కంటే అస‌లు స‌మ‌స్య లాక్ డౌన్ ఎత్తేసిన త‌ర్వాతే ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రం నుంచి దాదాపు 6లక్షల మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో..అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, గ్రానైట్ఇండస్ట్రీ దాకా ఎన్నో రంగాలపై ఎఫెక్ట్ ప‌డే పరిస్థితి కనిపిస్తోందని అంచ‌నా వేస్తున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో రవాణా స‌దుపాయం లేక‌పోయినా... లారీల్లో కొందరు.. సైకిళ్ల‌పై కొందరు..నడుస్తూ కొందరు.. సొంత ఊళ్ల‌కు బయలుదేరారు. ఇప్పటికే చాలా మంది తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. మరికొంత మంది సరిహద్దుల్లో, షెల్టర్ల‌లో గడుపుతున్నారు. లాక్ డౌన్‌ ఎత్తేస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, మళ్లీ వస్తారో రారో తెలియదు. వచ్చినా.. ఎప్పుడు వస్తారో చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో వలస కార్మికులపై ఆధారపడ్డ రంగాలన్నింటిపై తీవ్ర ప్రభావం పడనుందని విశ్లేషిస్తున్నారు.

 

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మందికిపైగా వలస కార్మికులున్నట్లు అంచనా. లాక్ డౌన్ అనౌన్స్ చేసిన వెంటనే 6 లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు నిర్వహించిన సర్వేలో 6.47 లక్షల మంది ఉన్నట్లు తేలింది. వీళ్ల‌లో కూడా చాలా మంది లాక్ డౌన్ నుంచి సడలింపులు వచ్చిన వెంటనే సొంత ప్రాంతాలకు వెళ్లి పోయేందుకు సిద్ధమవుతున్నారు. దీని కార‌ణంగా లాక్ డౌన్ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా.. బిల్డింగ్ కన్ స్ట్ర‌క్షన్, వుడ్ వర్క్, హోటల్ బిజినెస్, ప్రైవేటు కంపెనీలు, మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు ఇప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. లక్షలాది మంది కార్మికుల లోటు.. ఈ వ్యాపార రంగాలన్నింటినీ కుదిపేయనుందని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అగ్రికల్చర్ సెక్టార్లో కూలీల కొరత వేధిస్తోంది. వరి నాట్ల దగ్గర నుంచి వడ్లు మిల్లుకు చేరేదాకా వలస కూలీలది ప్రధాన పాత్ర. వీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నరు. వరి కోతల టైమ్లో హార్వెస్టర్ల డ్రైవర్లు, మెకానిక్లతో పాటు హమాలీలు కీలకం. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయాలంటే.. బస్తాల లోడింగ్, అన్ లోడింగ్ కు హమాలీలే ఆధారం. రాష్ట్రంలో ఒక్క బిహార్కు చెందిన హమాలీలే సుమారు 50 వేల మంది పని చేసే వారని మిల్లర్లు చెప్తున్నారు. హోలీ పండుగకు ముందు సొంతూళ్లకు వెళ్లిన వారు లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి రాలేదు. ఈ సీజన్లో ఒడిశా, జార్ఖండ్, ఏపీకి చెందిన మరో 20 వేల మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు రావాల్సి ఉండగా వారు కూడా రాలేకపోయారు. దీంతో హమాలీల కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగానే ధాన్యం కొనుగోళ్లు స్లోగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రోజుకు రూ.2 వేల కూలి, భోజనం, వసతి కల్పిస్తామని బీహార్, జార్ఖండ్లోని హమాలీలతో మాట్లాడుతున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: