తెలంగాణ‌లోని దాదాపు 64 ల‌క్ష‌ల మంది రైతుల కోసం ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్‌రావు క్రియాశీల‌క ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వసతి పెరుగుతున్నందున రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’ గా మారుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్రవ్యూహాన్ని ఖరారుచేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు అవసరమైన విధానం ఖరారుచేయాలని చెప్పారు. ఎరువులు అందుబాటులో ఉన్నందున రైతులు కొనుక్కోవాలని సీఎం కోరారు. నకిలీ ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అమ్మితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

 

 

చాలామంది వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని బతుకుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ``అసంఘటితంగా ఉండటం వల్ల, గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయకపోవడంవల్ల  రైతులు ఎంతో వ్యథను అనుభవించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు సంక్షేమం- వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితి కొంత మెరుగైంది.`` అని పేర్కొన్నారు. ``గోదావరి, కృష్ణా నదుల్లో రాబోయే రోజుల్లో దాదాపు 1300 టీఎంసీల నీటిని వాడుకొనే అవకాశం కలుగుతుంది. మిషన్‌ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కారణంగా సాగునీటి లభ్యత పెరిగింది. ప్రాజెక్టులు, చెరువులు, బోర్ల ద్వారా కోటి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు, పది లక్షల ఎకరాల్లో మూడు పంటలు పండే అవకాశమున్నది. అంటే ఏడాదికి దాదాపు మూడు కోట్ల ఎకరాల్లో పంట పండుతుంది. ఇందులో ఎక్కువశాతం వరి పండిస్తారు. ఏడాదికి కోటికిపైగా ఎకరాల్లో వరిపంట సాగయ్యే అవకాశమున్నది. అప్పుడు తెలంగాణ రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారుతుంది. ఇప్పుడు పండుతున్న పంటకు రెట్టింపుకన్నా రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ దిగుబడులు  వస్తాయి. అలా వచ్చిన దిగుబడులకు మద్దతుధర వచ్చే వ్యూహాన్ని ఖరారుచేయడం మన కర్తవ్యం.`` అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. 

 


భవిష్యత్తులో కూడా రైతులకు మద్దతు ధర అందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ``రైతులకు మద్దతు ధర ఇవ్వడంతోపాటు, ప్రజలకు బియ్యం, పప్పులు వంటి ఆహార దినుసులను తక్కువ ధరల్లో అందించే విధంగా పౌరసరఫరాల సంస్థ తన కార్యకలాపాలను విస్తరించుకోవాలి. ధాన్యం, కందులు, శనగలు, పెసర్లు లాంటివి కొని, వాటిని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా బియ్యం, పప్పులు తదితర వినిమయ సరుకులుగా మార్చి ప్రజలకు అందించాలి. దీనివల్ల అటు రైతులకు మేలు కలుగుతుంది. ఇటు ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహార దినుసులు లభిస్తాయి. ఈ దిశగా సంస్థ కార్యాచరణ రూపొందించి అమలుచేయాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: