అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. చైనా అంతు చూసే వరకూ నిద్రపోయేలా లేరు. ఇప్పటికే పలుమార్లు చైనాను హెచ్చరించిన ట్రంప్.. తాజాగా మరోసారి నిప్పులు చెరిగారు. కరోనా వ్యాప్తి విషయంలో చైనా పాత్రపై అమెరికా లోతైన దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. కరోనాపై చైనా ఇప్పటికీ వాస్తవాలు చెప్పట్లేదని దుయ్యబట్టారు.

 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి చైనాలో ప్రారంభమైన విషయం తెలిసిందే.! అక్కడ మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఆరంభంలో వైరస్‌ను చైనా సరిగా హ్యాండిల్‌  చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యానికి చైనా తగిన మూల్యం చెల్లించాల్సిందేనని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. చైనా నుంచి నష్టపరిహారం వసూలు చేయాల్సిందిగా సూచిస్తున్నాయి. అమెరికా ఈ విషయంలో ముందుండగా.. జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలు అమెరికాకు వంతపాడుతున్నాయి.

 

చైనాపై మొదటి నుంచి కయ్యానికి కాలుదువ్వుతున్న అమెరికా.. తాజాగా మరోసారి నిప్పులు చెరిగింది. కరోనా వైరస్‌ను మొదట్లోనే అరికట్టే అవకాశం ఉన్నా.. చైనా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని  అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్ ఆరోపించారు. చైనా చేసిన తప్పునకు అమెరికా సహా ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోందన్నారు.! దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రజల ఆరోగ్యం చిన్నాభిన్నమైందని..   ఇందుకు చైనాయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. 

 

కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి చైనా గుంభనంగా వ్యహవరించిందని అమెరికా మొదటి నుంచి వాదిస్తోంది. తాజాగా ట్రంప్ మరోసారి అవే కామెంట్స్ చేశారు. చైనా వాస్తవాల్ని తొక్కి పెట్టేందుకు  ప్రయత్నించిందని ఆరోపించారు. చైనా చేసిన తప్పునకు జర్మనీ 130 బిలియన్ యూరోల పరిహారం అడుగుతోంది. అయితే అది చాలా తక్కువ అని.. చైనా నుంచి తాము చాలా ఎక్కువే వసూలు  చేయాలనుకుంటున్నామని ట్రంప్ అన్నారు. అయితే ఎంత మొత్తం వసూలు చేయాలనుకునేది ఇంకా నిర్ణయించలేదన్నారు.. కరోనా వైరస్ వ్యాప్తి, చైనా వ్యవహరించిన తీరుపై తాము లోతైన దర్యాప్తు  చేస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. కరోనా మహమ్మారికి చైనానే బాధ్యత వహించేలా చేసేందుకు తమ వద్ద అనేక మార్గాలున్నాయని చెప్పారు. 

 

ప్రపంచవ్యాప్తంగా చైనా టెస్టింగ్ కిట్స్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ అమెరికా కూడా ఇదే విషయాన్ని లేవనెత్తింది. తమకు కూడా చైనా నాసిరకం టెస్టింగ్ కిట్స్‌ను పంపించిందని వైట్ హౌస్  ఆరోపించింది. వారం రోజులుగా చైనాపై అమెరికా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. కరోనా వైరస్‌కు చైనాయే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే అమెరికా ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది.  అమెరికా కంటే మిన్నగా చైనా కరోనాను ఎదుర్కొందని చెప్పింది. రాజకీయ ప్రయోజనాలకోసమే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: