ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఉత్తర కొరియా పెద్దగా స్పందిండం లేదు. దక్షిణ కొరియా మాత్రం ఆయన పూర్తి ఆరోగ్యం ఉన్నట్టు చెబుతోంది. మరోవైపు... కిమ్‌ గురించి తనకు అంతా తెలుసంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. ఇంతకీ కిమ్‌ గురించి ట్రంప్‌కు తెలిసిందేమిటి..? ఆయన ఆరోగ్యం గురించి చెప్పిందేమిటి..?

 

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్తలు ఊపందుకున్నాయి. కొన్ని వార్తా సంస్థలైతే కిమ్‌ బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారని... అతని సోదరి అధికార పగ్గాలు అందుబోతున్నట్టు కథనాలు రాశాయి. మరోవైపు కిమ్‌ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదంటూ దక్షిణ కొరియా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి సమయంలో కిమ్‌ గురించి తనకు స్పష్టమైన సమాచారం ఉందని చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అయితే... దానిపై తానిప్పుడు మాట్లాడలేనన్నారు. కిమ్‌ బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నట్టు చెప్పారు ట్రంప్‌. 

 

కిమ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు ట్రంప్‌. ఒక వేళ తాను అధ్యక్షుడిని  కాకపోయుంటే కొరియాతో అమెరికా యుద్ధం చేయాల్సి వచ్చేదన్నారు. కిమ్‌ పరిస్థితి ఎలా ఉందో తనకు తెలుసని... కానీ చెప్పలేనని... త్వరలోనే అందరికీ ఆ విషయాలు తెలుస్తాయన్నారు ట్రంప్‌. అంతేకాదు... గతంలో తాను కిమ్‌ను రెండు సార్లు కలిసినట్టు తెలిపారు అమెరికా అధ్యక్షుడు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను త్యజించేలా ఒప్పించడానికి తాను ప్రయత్నించినట్టు వివరించారు ట్రంప్‌.  

 

మొత్తానికి కిమ్‌ గురించి తనకు తెలుసనే విషయాన్ని చెప్పడానికి మాత్రమే ట్రంప్‌ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు స్పష్టమౌతోంది. అంతకు మించి ట్రంప్‌ చెప్పిందేమీ లేదు. ఏప్రిల్‌ 15న ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ 108వ జయంతి కార్యక్రమానికి కిమ్‌ హాజరుకాలేదు. కిమ్‌ జాంగ్‌ ఉన్‌కు కిమ్‌ ఇల్‌ సంగ్‌ తాత. దీంతో అప్పటి నుంచి కిమ్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ దేశాధినేత ఆరోగ్యంపై ఇన్ని వార్తలు వస్తున్నా...  ఉత్తర కొరియా పెద్దగా స్పందించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: