కరోనా.. ప్రపంచంలో ఇది సృష్టిస్తున్న అల్ల కల్లోలం అంతా ఇంతా కాదు.. అలాగే ఇది సోషల్ మీడియా యుగం.. నిజం చెప్పులు వేసుకునే లోపే.. అబద్దం ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. చివరకు రోగాలు, వాటి మందుల విషయంలోనూ అంతే.. అదే ఇప్పుడు చాలా మంది ప్రాణాల మీదకు తెస్తోంది. కరోనా నుంచి రక్షించుకోవాలన్న ఆత్రుతతోఇరాన్ లో తప్పుడు ప్రచారం నమ్మడం ఏకంగా 750 మంది ప్రాణాలు తీసేసింది.

 

 

ఆల్కహాల్ తాగితే కరోనా పోతుందని ఆ దేశంలో ఓ పుకారు వచ్చింది. అయితే అది మామూలు మద్యం కాదు. కాస్త ఘాటైన ఆల్కహాల్.. ఇలాంటి విషపూరితమైన ఆల్కహాల్ తాగి.. కరోనాను నుంచి విముక్తి పొందుదామనుకున్న 750 మంది ఆ విషపూరిత ఆల్కహాల్ కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మంది వరకూ ఈ కల్తీ ఆల్కహాల్ కారణంగా కంటి చూపు పోగొట్టుకున్నారు.

 

 

కరోనా వైరస్ కు మందు లేదు. ఇంకా దీనికి వాక్సీన్ కనిపెట్ట లేదు. అంతా ప్రయోగ దశలోనే ఉన్నాయి. ఇంట్లో ఉండటం, బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు పాటించడం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం.. ఇప్పటి వరకూ కరోనాపై పోరుకు మన వద్ద ఉన్న ఆయుధాలు ఇవే. కానీ.. సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి చిట్కాలతో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

 

 

మరో దారుణమైన విషయం ఏంటంటే.. 750 అనేది సర్కారీ లెక్క మాత్రమే.. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉందట. ఎదుకంటే ఇవన్నీ ఆసుపత్రుల్లో మరణించిన వారి లెక్కలన్నమాట. మరి ఇంకా బయట మరణించిన బాధితుల సంఖ్య ఇంకెంత ఉంటుందో అన్న ఆందోళన ఉంది. అందుకే కరోనా విషయంలో సోషల్ మీడియా వార్తలను నమ్మకండి. ప్రభుత్వాలు, డబ్ల్యూహెచ్ ఓ వంటి అధికారిక సంస్థల సమాచారాన్నే నమ్మండి.. ఇతరులకు పంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: