గత రెండు మూడు రోజులుగా ఏపీలో మీ వల్లే అంటే మీ వల్లే కరోనా వస్తుందని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వాదులాడుకుంటున్నాయి. వైసీపీ నేతలు హంగు, ఆర్భాటాలు వల్లే కరోనా పెరుగుతుందని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. దానికి ఉదాహరణలుగా వైసీపీ నేతలు నియోజకవర్గాల్లో చేసిన పర్యటనల వీడియోలని, ఫోటోలని చూపిస్తున్నారు. అలాగే కర్నూలు వైసీపీ ఎంపీ ఇంట్లో, శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే పెట్టిన ట్రాక్టర్ ర్యాలీ వల్ల కరోనా కేసులు రావడాన్ని ఎత్తి చూపుతున్నారు.

 

అయితే టీడీపీ నేతలు పెద్దగా లాక్ డౌన్ ఉల్లఘించిన ఘటనలు లేకపోవడం వల్ల వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడానికి కుదరడం లేదు. కానీ ఇటీవల చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అక్కడి టీడీపీ నేతలు, స్థానిక ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించారు. ఆ సందర్భంగా టీడీపీ నేతలు గుంపుగుంపులుగా చేరి, లాక్ డౌన్ ఉల్లఘించారు. ఇక ఇదే విషయాన్ని వైసీపీ నేతలు ఎత్తిచూపుతున్నారు.

 

కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. కుప్పంలో ఏమన్నా తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలో లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వైసీపీ నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

 

అయినా వైసీపీ చేసే ఆరోపణలు చిన్నపిల్లల సాకుల్లా ఉన్నాయని, వాళ్ళు చేసే తప్పుల్ని కవర్ చేసుకోవడానికే ఇలాంటి విమర్సలు చేస్తున్నారని మండిపడుతున్నారు. సాయం చేసే వాళ్ళు సైలెంట్ గానే చేస్తారని, మీకులా హడావిడి చేయరని అంటున్నారు. పైగా ఇలాంటి సమయంలో కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బాగా ఆర్భాటం చేస్తున్నారని, ప్రజలు ఇలాంటి ఆర్భాటాలు కోరుకోవడం లేదని, కాస్త సాయం కోరుకుంటున్నారని చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా హంగులు, ఆర్భాటాలు మానుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: