గతి, తేజ్, మరాసు, ఆగ్, నీర్, ప్రభంజన్, ఘుర్ని, అంబుద్, జలధి, వేగ.. ఈ పేర్లు ఏంటో చెప్పగలరా.. ఏవో కొత్తగా పుట్టే పిల్లల కోసం సిద్ధం చేసిన పేర్లు కావు. మరి ఇండియా క్షిపణుల కోసం ముందుగా సిద్ధం చేసుకున్న పేర్లలా ఉన్నాయ నుకుంటున్నారా..అదీ కాదు.. ఇవన్నీ రాబోయే కాలంలో వచ్చే తుపానుల కోసం సిద్ధం చేసి పెట్టుకున్న పేర్లు. అవును.. తుపాన్లను కొన్ని సంవత్సరాలుగా పేర్లతో పిలుచుకుంటున్నాం కదా. అందు కోసం ఇండియా ప్రతిపాదించిన పేర్లు ఇవి.

 

 

ఇప్పుడు ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే.. గతంలో ప్రతిపాదించిన పేర్లు మొత్తం అయిపోవచ్చేశాయి. 2004లో 8 దేశాలు ఉత్తర హిందూ సముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పేర్ల జాబితా రెడీ చేశాయి. అందులో పేర్లన్నీ వాడేశాం. చివరిది థాయ్ లాండ్ పేరు పెట్టిన ఆంఫన్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆంఫన్ తుపానుగా మారే అవకాశముంది. 2004 జాబితా పూర్తికావడంతో 2018లో కొత్త తుఫాన్లకు పేర్లు పెట్టేందుకు 13 దేశాలు రెడీ అయ్యాయి.

 

 

ఈ మేరకు అన్ని దేశాలు తమ తమ పేర్ల జాబితాలను రెడీ చేశాయి. ఉత్తర హిందూ సముద్రం, హిందూ సముద్రం, అరేబియా సముద్రంలో రాబోవు రోజుల్లో ఏర్పడే తుఫాన్లకు ఈ కొత్త పేర్లు పెడతారన్నమాట. మొత్తం 13 దేశాలు 169 పేర్లతో ఓ లిస్టు రెడీ చేశాయి. వాటిలో షహీన్ , గులాబ్, తేజ్, అగ్ని అనే పేర్లు కూడా ఉన్నాయి. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్ లాండ్, యూఏఈ, యెమన్ దేశాలు ఈ కొత్త పేర్లు ఇచ్చాయి.

 

 

ఇండియా ఇచ్చిన లిస్టులో గతి, తేజ్, మరాసు, ఆగ్, నీర్, ప్రభంజన్, ఘుర్ని, అంబుద్, జలధి, వేగ వంటి పేర్లు ఉన్నాయి. వీటిని ప్రజల నుంచి సలహాలు స్వీకరించి ఖరారు చేశారు. 13 దేశాలు ఖరారు చేసిన ఈ కొత్త పేర్లు వచ్చే 25 ఏళ్ల పాటు ఏర్పడే తుఫాన్లకు వాడతారన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: