తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ తగ్గుతోంది. రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 7 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 1016కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రజల్లో భయాందోళన తగ్గుతోంది. 
 
మరికొన్ని రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధలను సడలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని ఆంక్షలను ఎత్తివేసింది. సీఎస్ సోమేష్ కుమార్ ఈరోజు పట్టణ ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు నడుపుకునేందుకు జీవో ఇచ్చారు. 
 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎగుమతి చేసే యూనిట్లు, ప్రహరీ ఉన్న పరిశ్రమలు, చెంతనే కార్మికులు ఉన్న పరిశ్రమలు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. అయితే పరిశ్రమలలో ఉద్యోగులు, కార్మికులు నిర్ణీత దూరం పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం పరిశ్రమలకు లాక్ డౌన్ నిబంధనల నుంచి సడలింపులు ఇవ్వడంపై కార్మికులు, పరిశ్రమల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ ఉండటం ప్రజలకు శుభవార్త అనే చెప్పవచ్చు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మాత్రమే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరికొన్నిరోజుల్లో తెలంగాణ కరోనా రహిత రాష్ట్రం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కరోనా కట్టడి చేయడంలో సక్సెస్ అయిన కేసీఆర్ ను ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి. మరోవైపు ఏపీలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 73 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1332కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: