ప్రపంచంలోని అతి పెద్ద పరిశ్రమలలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒకటి. ఈ పరిశ్రమపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇటువంటి భారత సినీ పరిశ్రమకు ఆద్యుడు దాదాసాహెబ్ ఫాల్కే. ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు. మహారాష్ట్రలోని త్రియంబకేశ్వరంలో జన్మించిన ఫాల్కే ముంబైలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1896లో ఒక హోటల్ లో ఏసుక్రీస్తు చరిత్రపై తీసిన ఒక సినిమాను చూసిన ఫాల్కే హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తీయాలని సంకల్పించారు. 
 
 
1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో ఫాల్కే సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా దాదాపు 19 సంవత్సరాలు ఫాల్కే సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. ఫాల్కే 95 సినిమాలను, 26 లఘు చిత్రాలను తెరకెక్కించారు. సంపాదించిన ప్రతి రూపాయిను సినీ పరిశ్రమ కోసమే ఫాల్కే ఖర్చు పెట్టారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు ఫాల్కే చేసిన కృషి మరువలేనిది. 
 
ఆయన సినీపరిశ్రమలోని వాణిజ్యపరమైన విశేషాలను పెద్దగా పట్టించుకోలేదు. భారతీయ సినిమా పితామహుడిగా ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి ఆయన శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని చిత్ర పరిశ్రమ కోసం ఎంతో కృషి చేసి, అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన వారికి అందజేస్తోంది. 
 
చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అర్హులే. 1969లో ఈ పురస్కారాన్ని దేవికారాణి అందుకున్నారు. తెలుగులో మల్లీశ్వరి, బంగారు పాప లాంటి సినిమాలను బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని అవార్డులు ఉన్నపటికీ కూడా ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మాత్రం చాలా స్పెషల్. 2019 సంవత్సరానికిగాను అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది.         

మరింత సమాచారం తెలుసుకోండి: