కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రాలన్నీ కరోనా కట్టడికి కృషిచేస్తున్నా.. టెస్టుల విషయంలో మాత్రం రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా  ఐసీఎమ్మార్ ఇచ్చిన ఆదేశాల్లో లక్షణాలుంటేనే  పరీక్షలు జరపాలని చెప్పింది. దాంతో ఇక ఎవరికి పడితే వాళ్ళకు కరోనా టెస్టులు చేయబోమని తెలంగాణ ప్రభుత్వం ‌ తేల్చేసింది.

 

వెంటాడుతున్న కరోనా మహమ్మారి కలవర పెడుతోంది. దీంతో తుమ్మినా.. దగ్గినా... అనుమానించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి‌.  ఒకవేళ అదే అనుమానంతో వెళ్లి టెస్టు చేయించుకుందామన్నా ఇకపై కుదరదు. పూర్తిస్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు జరపాలని చెప్పింది భారత వైద్య పరిశోధనా సంస్థ. దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు లేదా కండరాల నొప్పులు ఉంటేనే టెస్టులు చేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు ఎవరికైనా పాజిటివ్ వస్తే దగ్గరి కాంటాక్ట్స్‌ను మాత్రమే పరీక్షించాలని సూచించింది.

 

తెలంగాణాలో ఇప్పటికి దాదాపు 19 వేలకు పైగా టెస్టులు నిర్వహించింది ప్రభుత్వం. అందులో వెయ్యికి పైగా అంటే.. 5.3 శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు.. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్ వెళ్ళొచ్చిన వాళ్ళు రాష్ట్రంలో కరోనా క్యారియర్స్ గా మారారు.. ముఖ్యంగా మర్కజ్ వెళ్ళొచ్చిన వాళ్ళ ద్వారా ఎక్కువ మందికి  సోకింది..

 

రాష్ట్రంలో ముందుగా మర్కజ్ వెళ్ళొచ్చిన వారికీ... వారి కుటుంబ సభ్యులతో పాటు ఎవరెవరిని కలిశారో గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇకపై కరోనా వచ్చిన వారి దగ్గరి కాంటాక్టులకు మాత్రమే పరీక్షలు చేయనున్నారు. అనుమానం ఉంటే కాదు.. లక్షణాలుంటేనే టెస్టులు చేస్తామని స్పష్టం చేసింది తెలంగాణ సర్కారు. అయితే ఈ మధ్య కాలంలో లక్షణాలు లేకున్నా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ట్రావెల్ హిస్టరీ, అత్యవసర సేవల్లో ఉన్నవారికి.. పరిస్థితులను బట్టి టెస్టులు నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: