ప్రపంచమంతా కల్లోలం సృష్టిస్తూ... అగ్రరాజ్యాలకు సైతం కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న కరోనా వైరస్‌కు ఎండ దెబ్బ తగిలిందా? పెరుగుతున్న వేడికి వైరస్‌ తన సామర్థ్యాన్ని కోల్పోతోందా? భారతీయ శాస్త్రవేత్తలు ఏం తేల్చారు?

 

వేసవికాలం వచ్చిందంటే.. ఇండియాలో వాతావరణం మామూలుగా ఉండదు. ఉదయం పది దాటితే చాలు ఎండ సుర్రుమంటుంది. అయితే, అలాంటి వాతావరణంలో కరోనాకు మనుగడ కష్టమవుతున్నట్లు భారతీయ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. దేశంలోని వేడి వాతావరణం వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో దోహదపడే అవకాశముందని తేల్చారు. 

 

వాతావరణ పరిస్థితులతో పోలిస్తే.. భౌతిక దూరం, లాక్‌డౌన్‌ వంటి చర్యలే కొవిడ్‌పై పైచేయి సాధించడంలో కీలకమైన ఆయుధాలని స్పష్టం చేశారు శాస్త్రవేత్తలు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, శ్రీనగర్‌, న్యూయార్క్‌లలో వాతావరణ పరిస్థితులను.. వైరస్‌ వ్యాప్తి తీరును నాగ్‌పుర్‌లోని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకులు.. విశ్లేషించారు. వైరస్‌లు అధిక ఉష్ణోగ్రతల్లో తమ సామర్థ్యాన్ని కోల్పోతుంటాయని.. కరోనా అందుకు అతీతమేమీ కాదని తేల్చారు. అయితే, స్వీయ జాగ్రత్తలతోనే ఈ వైరస్‌ను కట్టడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచించారు. అలాంటి చర్యల వల్లే కేరళలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగారన్నారు. 

 

మరోవైపు, కరోనా వైరస్‌ పుట్టుక రహస్యాన్ని ఛేదించడమే లక్ష్యంగా అమెరికా, చైనా శాస్త్రవేత్తలు సంయుక్త అన్వేషణను మొదలెట్టారు. కొలంబియా యూనివర్సిటీతో పాటు గ్వాంఘౌలోని సన్‌-యట్‌-సేన్‌ విశ్వవిద్యాలయానికి పరిశోధకులు దీనిపై కసరత్తులు ప్రారంభించారు. గత ఏడాది డిసెంబరు కంటే ముందే కరోనా ఆవిర్భవించిందా? వుహాన్‌లో కాకుండా మరెక్కడైనా అది వెలుగుచూసిందా? అనే కోణంలో పరిశోధన చేస్తున్నారు. మొత్తానికి సూర్యుడి భగభగలు కరోనా వైరస్ అంతానికి సపోర్ట్ చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ వేడికి పరిస్థితి అదుపులోకి వస్తుందంటున్నారు. ఎండ తీవ్రత జనాన్ని కాస్త ఇబ్బంది పెట్టినా.. రాక్షస వైరస్ అంతు చూస్తోందంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: