ఆంధ్రప్రదేశ్‌ మొత్తం కరోనా వైరస్ విజృంభిస్తున్నా... కొద్ది రోజుల క్రితం వరకూ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో హఠాత్తుగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎవరూ లేకపోయినా... అక్కడి నుంచే వైరస్‌ను మోసుకొచ్చిన లింకులు బయటపడటం ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతోంది.  

 

ఢిల్లీ పేరు వింటేనే శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ఉలిక్కిపడుతోంది. జిల్లాలో నమోదైన తొలి కరోనా పాజిటివ్ కేసు మూలాలు.. తాజాగా నమోదైన కేసు లింకులు ఢిల్లీతో ముడిపడి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. రాష్ట్రంలోనే కరోనా ఫ్రీ జిల్లాగా నెల రోజుల పాటు ప్రశాంతంగా ఉంది శ్రీకాకుళం. ఇప్పుడు అదే జిల్లాలో ఒకే రోజు మూడు కేసుల నమోదు కావటం కలకలం రేపుతోంది. పాతపట్నం మండలానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీలోని మెట్రో రైల్ కార్పొరేషన్‌లో పని చేస్తున్నాడు. అతని భార్య పాతపట్నం మండలంలోని కాగువాడ గ్రామంలోని అత్తారింట్లో ఉంటోంది. దీంతో కుమారుడు, భార్యను తీసుకెళ్లేందకు ఆ యువకుడు మార్చి 19న అత్తారింటికి వచ్చాడు. అయితే అప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడింది జిల్లా అధికార యంత్రాంగం. ఢిల్లీ నుంచి వచ్చిన యువకుడిని హోమ్ క్వారంటైన్‌కు తరలించారు. నెల రోజులు క్వారంటైన్ పూర్తిచేసుకున్న ఆ యువకుడికి నిర్వహించిన పరీక్షల్లో అనుమానిత లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అతన్ని జిల్లా కొవిడ్ హాస్పిటల్‌కు తరలించారు అధికారులు. యువకుడి రిపోర్టులు నెగిటివ్‌గా వచ్చాయి. అతని కుటుంబంలోని నలుగురికి మాత్రం పాజిటివ్ లక్షణాలున్నట్లు రిపోర్టులు తేలాయి. ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. 

 

ఇక...తొలిదశ లాక్‌డౌన్ ప్రారంభమైన రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ కలకలం మొదలైంది. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో శ్రీకాకుళం జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా నుంచి ఒక్కరు కూడా ఢిల్లీ సమావేశాలకు వెళ్లలేదని తేలిపోయింది. మార్చి 13 నుంచి 22 తేదీల్లో ఢిల్లీ ఇతర పనుల మీద వెళ్లి, వచ్చిన వారి వివరాలను సేకరించారు. 2 వందల 30 మందిని ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించారు. వారందరికీ హోమ్ క్వారంటైన్ విధించారు. పాతపట్నం కేసు వెలుగులోకి రావటం సంచలనం సృష్టించింది. దీంతో జిల్లాలో ఢిల్లీ నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారందరికీ పరీక్షలు చేయాలని అధికారులు భావించారు. శ్రీకాకుళం నగర పరిధిలో ఢిల్లీ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్ అని తేలిపోయింది. ఐతే జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన అన్ని కేసులకు మూలం ఢిల్లీ రిటర్నర్స్ అని ఓ నిర్ధారణకు వచ్చారు. జిల్లాలో ఢిల్లీ నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారందరిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరికి ఏ చిన్న అనారోగ్యం ఉన్నా తక్షణమే ఓ ఫోన్ కొట్టండని సూచిస్తున్నారు. ఎవరైనా క్వారంటైన్‌లో లేకుండా బయట తిరుగుతున్న వారు ఉంటే..తక్షణమే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన వేళ కూడా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

ఇక...శ్రీకాకుళం నగరం మొత్తం కంటైన్మెంట్ జోన్‌లోకి వెళ్లిపోయింది. పాజిటివ్ కేసు నమోదైన పీఎన్ కాలనీతో పాటు చాలా ప్రాంతాలు రెడ్‌జోన్ కిందకు వచ్చేశాయి. పాజిటివ్ యువకుడిని జిల్లా కొవిడ్ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అతనితో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులు, మిత్రులు ఇలా 18 మందిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నగరం మొత్తం కంటైన్మెంట్ జోన్‌లోకి వెళ్లిపోయింది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. పీఎన్ కాలనీని అష్ఠదిగ్భంధనం చేశారు. కాలనీలో ఉండేవారు ఏ ఒక్కరూ బయటికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా...అన్నీ ఇళ్లకే పంపించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మున్సిపల్ శాఖ...పీఎన్ కాలనీ అంతా శానిటేషన్ చేస్తోంది. 

 

ఏది ఏమైనప్పటికీ నెలరోజుల పాటు ఏ టెన్షన్ లేకుండా ఉన్నారు సిక్కోలు ప్రజలు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన వారి వల్ల జనానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: