విశాఖ జిల్లాలో పూల రైతులపై లాక్‌డౌన్ ప్రభావం పడింది. జిల్లాలో బంతి పూల రైతు బతుకు చితికిపోయింది. లాక్‌డౌన్‌ రైతుల ఆదాయానికి భారీ గండికొట్టింది. పూల ధరలు ఒక్కసారిగా పడిపోయాయ్. తక్కువ ధరలకు అమ్ముదామన్నా కొనేవారే లేకుండా పోయారు. పూలు సాగు చేసే రైతులు లాక్‌డౌన్‌తో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

 

విశాఖ జిల్లా లక్కవరం గ్రామంలో బంతి సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్న రోజుల్లో బంతి పువ్వులు వాడి నేల రాలిపోయాయి. ఐతే...ఇదే సమయంలో కురిసిన అకాల వర్షం బంతి పూల రైతులకు కొంత ఊరటనిచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆ ఆశా నిరాశగానే మారింది. ప్రజారవాణా స్తంభించిపోవటంతో బంతి పూలు ఎగుమతి చేయటానికి అవకాశం లేకుండా పోయింది. బంతి మొక్కలను బెంగుళూరు నుంచి దిగుమతి చేసుకున్నారు రైతులు. ఒక్కో మొక్కను 6 రూపాయలకు కొన్నారు. సుమారు 40 వేల మొక్కలకు 3 లక్షల రూపాయలు కూలీలకు చెల్లించారు. ఐతే..ప్రస్తుతం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.

 

బంతి మొక్కలు నాటిన 45 రోజులకు పూలు కోయటానికి అవకాశం ఉంటుంది. లాక్‌డౌన్ ప్రభావంతో పువ్వులు అమ్మే దుకాణదారులు తోటల్లోకి రావటం లేదు. పెళ్ళిళ్లు కూడా దాదాపుగా ఆగిపోయాయి. దేవాలయాలు మూసివేశారు. ట్రాన్స్‌పోర్ట్ లేకపోవటంతో బంతి ప్వువులను తోటల్లోంచి తరలించటం కష్టంగా మారింది. పూలను అమ్ముకునే అవకాశం లేకుండా కరోనా కట్టడి చేసింది. కొనేవారు లేక పంట సాగు చేసిన తోటల్లోనే ఉండిపోయిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. దేవరాపల్లి మండలం ప్రధాన రహదారి పక్కనే పూల తోటలు ఉన్నాయి. 

 

అయితే  డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు కిలో బంతి పూల ధర 80 రూపాయల వరకు ఉండేది. తక్కువలో తక్కువగా 25 నుంచి 30 రూపాయల వరకు ధర పలికేది. లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్‌ పూర్తిగా స్తంభించిపోయింది. ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా కిలో పూలు 3 నుంచి 5 రూపాయలకు పడిపోయాయి. ఇప్పుడు ఆ ధరకూ కొనేవారు లేక వీధుల్లోనే పారబోస్తున్నారు. ఎక్కువ మంది రైతులు పూలను కోయకుండానే పశువులకు ఆహారంగా వదిలేస్తున్నారు. అప్పులు తెచ్చి సాగు చేశామని ఆవేదన చెందుతున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో బంతి పూల రైతులు నిండా మునిగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ కల్పించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు బంతి పూల రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: