దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేలు దాటింది. మ‌ర‌ణాలు వెయ్యి మార్కును దాటేశాయి. ఇంకా రోజురోజుకు కేసులు, మ‌ర‌ణాల‌ సంఖ్య పెరుగుతూనే ఉం‌ది. ఈ నేపథ్యంలో మే 3వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించాలా.. వద్దా? ఒకవేళ పొడిగిస్తే ఎప్పటివరకు పొడిగించాలి? లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురుకానున్నాయి? పొడిగించ‌క‌పోతే ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు ఏవి? ఇవీ.. ఇప్పుడు ప్ర‌ధానంగా కేంద్ర ప్ర‌భుత్వం ముందు, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ముందు ఉన్న ప్ర‌శ్న‌లు. ఇదే స‌మ‌యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతర ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఇదే సమయంలో కొన్ని నిబంధనలు విధించింది.

 

అయితే, క‌రోనా వ్యాధిగ్రస్తులు ప్ర‌యాణిస్తే ప‌రిస్థితి ఏంటి? వారిని గుర్తించ‌డం ఎలా? అనే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. కరోనా రోగులు, స్వీయ నిర్బంధంలో ఉన్నవారిపై నిఘా కోసం సాంకేతిక చేతిపట్టీని ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా రూపొందించిన నమూనాలను ఆస్ప‌త్రులు, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపనున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌ జార్జ్‌ కురువిల్లా తెలిపారు. అనంతరం దేశీయ స్టార్టప్‌ కంపెనీల ద్వారా వీటి తయారీని చేపడతామని చెప్పారు. ఈ చేతి పట్టీ ఆరోగ్యసేతు యాప్‌ డేటాతోనూ అనుసంధానమై ఉంటుందన్నారు. తద్వారా సమీపంలో ఉన్న వైరస్‌ రోగుల గురించి హెచ్చరిస్తుందని ఆయ‌న అన్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి తిరిగిన ప్రాంతాలను ఇది ఫొటో తీస్తుందని, తద్వారా వారిని కలిసిన ఇతర వ్యక్తులను కూడా గుర్తించవచ్చని అన్నారు.  

 

 


కాగా, కొవిడ్‌-19 వైరస్‌వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశించింది. ఇదే రీతిలో ప్ర‌జ‌ల‌కు సైతం త‌ప్ప‌నిస‌రిగా యాప్ వాడాలని సూచించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: