ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ 60కు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 71 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1403కు చేరింది. రాష్ట్రంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సాధారణంగా కరోనా సోకితే ఎవరికైనా జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 
కానీ రాష్ట్రంలో నమోదవుతున్న 75 శాతం కేసుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. నిన్నటివరకు 1403 కేసులు నమోదు కాగా 1050 మందిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. అయితే కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పరీక్షలు నిర్వహిస్తుంటే కరోనా సోకినట్లు నిర్ధారణ అవుతోంది. ఎలాంటి లక్షణాలు లేనివారికి పాజిటివ్ వస్తూ ఉండటంతో వైద్యులు షాక్ అవుతున్నారు. 
 
ఇలా లక్షణాలు కనిపించని వారి నుంచే రాష్ట్రంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు. వీరు బయట తిరగడం ద్వారా ఇతరులు కరోనా భారీన పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇలా కరోనా సోకినా లక్షణాలు కనిపించని వారంతా 60 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. 20 నుంచి 40 ఏళ్ల లోపు వారు కరోనా భారీన ఎక్కువగా పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. 
 
వైరస్ సోకిన వారిలో 45 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లే కావడం గమనార్హం. లక్షణాలు ఉన్న కేసుల్లో చిన్నపిల్లలు 5 శాతంగా ఉంటే లేని కేసుల్లో 13 శాతంగా ఉన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తే కరోనా భారీన పడే అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 386 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కర్నూలులో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సీఎం జగన్ ఈ జిల్లాపై దృష్టి పెట్టారు. అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: