పీజేఆర్.. పి. జనార్దన్ రెడ్డి.. హైదరాబాద్ లో పవర్ ఫుల్ మాస్ లీడర్. మాస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే మాస్ అన్న పేరుంది. హైదరాబాద్ లోని బడుగు బలహీన వర్గాల్లో.. పేదల బస్తీల్లో ఆయనకు ఉన్నంత అభిమానం మళ్లీ ఇప్పటి వరకూ ఏ ఇతర నేతకూ లేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు. కార్మిక నాయకుడిగానే రాజకీయాల్లో ఎదిగారు. తనకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నారు.

 

 

పీజేఆర్ అప్పట్లో హైదరాబాద్ లోని అనేక కంపెనీల్లో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉండేవారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా తక్షణం రంగంలోకి దిగిపోయేవారు. పీజేఆర్ ఉన్నారన్న భరోసా కార్మిక వర్గానికి కొండంత అండగా ఉండేది. ఆ కార్మిక నాయకత్వమే పీజేఆర్ ను రాజకీయాల్లో రాణించేలా చేసింది. అందుకే ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి 1978, 1985, 1989, 1994, 2004 లలో వరుసగా గెలిచాడు. తిరుగులేని నాయకుడిగా నిలిచాడు.

 

 

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతంలోని టీ బంకులు మొదలుకుని.. సెలూన్లు, రోడ్డుపక్కనున్న చెప్పుల షాపులు, దుకాణాలు.. ఎందులోనైనా సరే.. పీజేఆర్ నవ్వుతున్న ఫోటో ఒకటి ఉండాల్సిందే. పీజేఆర్ ఆ షాపు ఓపెనింగ్ కు వచ్చిన ఫోటో ఉండాల్సిందే. అంతగా జనంలోకి వెళ్లిన నాయకుడు పీజేఆర్. పీజేఆర్‌ జనం నాయకుడు అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

 

 

ఏ సమయమైనా.. ఎలాంటి సమస్య అయినా ఖైరతాబాద్ ప్రజలకు గుర్తొచ్చేది పీజేఆరే.. ఆ బస్తీలు, గుడిసెల్లోని వారికి ఆయన ప్రత్యక్ష దైవంగా మారారు. ఓసారి గుడిసెలు పీకేసేందుకు అధికారులు వస్తే.. గుడిసెపై మొదటి గునపం ఎవరు వేస్తే, అదే గునపం వారి గుండెలో దిగుతుంది అంటూ గర్జించాడు పీజేఆర్‌. అంతే అధికారులు వెనుదిరిగారు. అలా పీజేఆర్‌ పేదల దేవుడు అయ్యారు. ఆ తర్వాత మంత్రి అయినా, ప్రతిపక్ష నేతగా అధికారపక్షాన్ని గడగడలాడించినా.. ముందు ఆయన ఓ కార్మిక నేత, పేదల దేవుడు అంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: