ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,02.400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఏపీలో మిలియన్ కు 1919 పరీక్షలు జరిగాయని అన్నారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎక్కువ పరీక్షలు చేస్తున్నామని... దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎన్నో రెట్లు ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 403 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. 
 
రాష్ట్రంలో 33 మంది చనిపోయారని... వీరిలో ఎక్కువమంది ఇతర సమస్యలతో బాధ పడేవారే అని అన్నారు. ప్రతిరోజూ సీఎం జగన్ సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. పాజిటివ్ కేసుల శాతాన్ని చేసిన పరీక్షలను బట్టి చూడాలని తెలిపారు. ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత 24 గంటల్లో 60 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 
 
కొంతమందికి ప్రభుత్వం కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలు అర్థం కావని, కొందరు అర్థమైనా నటిస్తారని చంద్రబాబును, ప్రతిపక్షాలను ఉద్దేశించి బుగ్గన విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశంసించడం మాని విమర్శలు చేయడం బాధాకరం అని అన్నారు. కొన్ని కారణాల వల్ల కర్నూలు జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని.... జిల్లాలో కరోనాను కట్టడి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. 
 
కర్నూలులో వృద్ధులే ఎక్కువగా కరోనా భారీన పడి చనిపోయారని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో కరోనా తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలను ప్రభుత్వం భయాందోళనకు గురి చేయాలనుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈరోజు 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులలో కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: