ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఈరోజు 60 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు జిల్లాలలోనే ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 411కు చేరగా గుంటూరు జిల్లాలో బాధితుల సంఖ్య 306కు చేరింది. 
 
రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఈ రెండు జిల్లాల్లోనే దాదాపు 50 శాతం కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ రెండు జిల్లాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం ఈ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. 
 
పరీక్షల సంఖ్య పెంచడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,00,000కు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఈ రెండు జిల్లాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కరోనా భారీన పడి ఎవరూ చనిపోలేదు. కానీ ఈరోజు మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 33కు చేరింది. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా త్వరలో కరోనా తగ్గుముఖం పడుతుందని ఏపీ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: