కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై వేటు తప్పదా? కర్నూలు మునిసిపల్ కమిషనర్ తరహాలోనే ఇంకొందరిపై బదిలీ వేటు పడనుందా? ఇంకెందరు అధికారులపై కరోనా ఎఫెక్ట్ పడుతోందో అనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. 

 

ఏపీలో కరోనా ప్రభావితం జిల్లాలు ప్రధానంగా మూడు ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా . ఈ మూడు జిల్లాల్లో భారీగా పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బులెటిన్ లో కూడా పాజిటీవ్ కేసుల సంఖ్య 43గా ఉంది. దీంతో ఒక్క కర్నూలు జిల్లాలో పాజిటీవ్ కేసుల సంఖ్య 334కు చేరుకుంది. రాష్ట్రం మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 1403 ఉంటే.. ఒక్క కర్నూల్ లోనే 334 ఉండడం ఆందోళన కలిగించే అంశం. 

 

అయితే కర్నూలులో కార్పొరేషన్ పరిధిలో కేసులు పెరగటం వెనుక మున్సిపల్ కమిషనర్ వైఫల్యం ఉందనే చర్చ నడుస్తోంది. ఇదే సందర్బంలో కర్నూలు కలెక్టర్ వీరప్యాండన్ కూడా కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో, పరిస్థితిని ముందుగా అంచనా వేయడంలో తబ్లీగ్ లింకులున్న వ్యక్తులను ట్రేస్ చేయడంలో విఫలమయ్యారనే భావన ప్రభుత్వంలో ఉంది. ఈ క్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబును తప్పించింది ప్రభుత్వం. ఆయన స్థానంలో పాడేరు ఐటీడీఏ పీఓ బాలాజీని కర్నూలు మున్సిపల్ కమిషనరుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 

ఈ క్రమంలో మరికొందరు అధికారుల మీద కూడా ఇదే తరహాలో చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. కర్నూలుతో పాటు, గుంటూరు జిల్లాలో కూడా పరిస్థితి అదుపు తప్పడానికి కొందరి అధికారుల నిర్లక్ష్యం ఉందనే విమర్శలున్నాయి. గుంటూరు జిల్లా యంత్రాంగంతోపాటు.. స్థానిక పరిపాలన యంత్రాంగం.. నరసరావు పేట మున్సిపాల్టీకి చెందిన అధికారుల తీరు సరిగా లేదనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కర్నూలు మున్సిపల్ కమీషనర్ రు తప్పించటంతో, ఇంకెవరి మీదైనా చర్యలు ఉంటాయా..? అనే చర్చ జరుగుతోంది.

 

ఏపీ మొత్తం మీద వివిధ జిల్లాల్లో కరోనా నివారణ చర్యల్లో అలక్ష్యం ప్రదర్శించిన ఇంకొందరు అధికారుల జాబితాను కూడా ప్రభుత్వం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారుల మీద రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఏమైనా వచ్చాయా.. అనే కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఒకవేళ రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చుంటే ఉన్నత అధికారులకు అలెర్ట్ చేసి ఉంటే పరిస్థితి చేయి దాటేది కాదు కదా.. అనేది ప్రభుత్వ పెద్దల భావన. ఓవరాల్ గా మరికొంత సమాచారం సేకరించిన తర్వాత కరోనా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద చర్యలుండే సూచనలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: