కరోనా ఎఫెక్ట్ పాఠ్య పుస్తకాల ముద్రణపై కూడా పడింది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు టెండర్లే పిలవలేదని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రింటింగ్ ప్రెస్ లు మూసి వేయాల్సి రావడంతో అంతా గందరగోళంగా మారింది. 

 

కరోనా కాటు స్టేషనరీ, ముద్రణ రంగంపై పడింది. విద్యాసంస్థలకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, రిజిస్టర్లు ముద్రించే ఈ రంగం లాక్‌డౌన్‌తో మూతపడింది. తెలంగాణలో నడుస్తున్న 32 వేల యూనిట్లు పడకేయటంతో వీటిలో పనిచేసే దాదాపు 9 లక్షల మంది కార్మికులకు ఉపాధి కరవైంది. ఔషధాలు, విత్తనాలు తదితర కంపెనీలకు ప్యాకింగ్‌ పరంగా కావాల్సిన లేబుళ్లను ముద్రించే యూనిట్లకు కూడా తాళాలు పడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా విద్యా సంబంధిత సామగ్రి ముద్రణకు నాలుగు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. 

 

ప్రతీ సంవత్సరం మార్చి-జూన్‌ మధ్య స్టేషనరీ, ముద్రణ రంగానికి భారీ గిరాకీ ఉంటుంది. ఈసారి పరీక్షలు లేకపోవడంతో పరీక్షా పత్రాల తయారీ నిలిచిపోయింది. తెలంగాణలో 32 లక్షల ప్రైవేటు విద్యార్థులు, 27 లక్షల 50 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరానికి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యాసంస్థలు ఇప్పటికీ ఆర్డర్లు ఇవ్వలేదు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదు రకాల పాఠ్య పుస్తకాలు, ఆరు నుంచి టెన్త్‌ వరకు  ఆరు రకాల పాఠ్య పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. మరోవైపు  ప్రింటింగ్‌ యూనిట్లలో పెళ్లి పత్రికలు, కరపత్రాలు, పోస్టర్లు, విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల ప్యాకింగ్‌కు అవసరమయ్యే లేబుళ్లు కూడా తయారవుతుంటాయి. సరిగ్గా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కరోనా వ్యాప్తితో ఈ యూనిట్లు నడవలేని పరిస్థితి ఏర్పడింది. కూలీలు, కార్మికుల మధ్య భౌతికదూరం పాటించాల్సి రావడం, వారి రాకపోకలకు రవాణా లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి రంగులు, పేపర్ల దిగుమతి ఆగిపోయింది. ఇప్పటికే ముద్రించి ఉంచిన సామగ్రి డెలివరీ కూడా జరగలేదు. ఒక్క  హైదరాబాద్ 
లోనే 4 వందల ప్రింటింగ్‌ యూనిట్లు ఉన్నాయి. 

 

ముద్రణ రంగానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని, కార్మికులు, కూలీలకు పాస్‌లు జారీచేసి సామగ్రి రవాణాకు వీలు కల్పిస్తే బాగుంటుందని తెలంగాణ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ అర్ధిస్తోంది. పది లక్షలకు పైగా కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నాయి. మొత్తానికి ఈసారి పాఠ్యపుస్తకాలకు ఇక్కట్లు తప్పేలా లేవు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: