దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో పాటు వైరస్ కొత్త లక్షణాలను గుర్తిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అమెరికా హెల్త్ ఏజెన్సీ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కరోనాకు సంబంధించిన 6 కొత్త లక్షణాల జాబితాను తాజాగా విడుదల చేసింది. 25 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని పేర్కొంది. 
 
కరోనా సోకిన వారిలో చలి, తలనొప్పి, గొంతునొప్పి, నరాల నొప్పి, వాసన మరియు రుచి శక్తి తగ్గిపోవడం, పెదాలు మరియు ముఖం రంగుల్లో మార్పులు రావడం, ఆకస్మిక గందరగోళం లాంటి లక్షణాలను గుర్తించినట్టు తెలిపింది. వేలాది మంది రోగులను పరిశీలించి ఈ లక్షణాలను కనుగొన్నట్టు పేర్కొంది. గతంలో దగ్గు, జ్వరం, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలను మాత్రమే వైద్యులు గుర్తించారు. 
 
పిల్లల్లో మాత్రం కరోనా లక్షణాలు భిన్నంగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వారిలో కరోనా లక్షణాలతో పాటు ఇతరత్రా లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. కరోనా సోకిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నారని... పిల్లల్లో కడుపు నొప్పి, గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. కొందరు పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా నిర్ధారణ అవుతోందని చెబుతున్నారు. 
 
మరోవైపు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు లాక్ డౌన్, భౌతిక దూరం తప్ప మరో మార్గం లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,000 దాటింది. మృతుల సంఖ్య వెయ్యి దాటింది. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో ఈరోజు 60 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1463కు చేరింది. తెలంగాణ లో నిన్న 22 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1038కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: