లాక్ డౌన్ వేళ సరిహద్దులు దాటి రాష్ట్రంలో ప్రవేశిస్తున్న మద్యానికి కళ్లెం వేసేందుకు ఆబ్కారీశాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అక్రమ మద్యం అమ్మకాలు, నాటుసారా కట్టడి చేసేందుకు విశాఖ జిల్లా ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్న చోట జాయింట్ ఆపరేషన్లకు సిద్ధమైంది. 

 

విశాఖ జిల్లాలో మందుబాబులకు లాక్ డౌన్ చుక్కలు చూపిస్తోంది. లిక్కర్ షాప్ లు... బార్లు మూత పడటంతో రోజులు గడిచే కొద్దీ లిక్కర్ దొరకడం గగనమైంది. ఆంక్షలు అమల్లోకి వచ్చిన మొదట్లో బ్లాక్ దందా బాగా నడిచింది. ఎన్నికల సమయం కావడంతో స్టాక్ పెట్టుకున్న వారు...మందు బాబుల బలహీనతను క్యాష్ చేసుకున్నారు. డిమాండ్ ను బట్టి క్వార్టర్ వెయ్యి రూపాయల వరకు అమ్మారు. ఇప్పటికీ బ్లాక్ లో 3నుంచి ఐదు వేల రూపాయలకు ఫుల్ బాటిల్  దొరుకుతోంది.

 
 
లాక్ డౌన్ వల్ల మూసివేసిన షాపులు, బార్ల నుంచే దొడ్డిదారిన మద్యం అమ్మకాలు నడిచాయి. పెందుర్తిలో గణేష్ బార్ లోఈ దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఇక గాజువాక ప్రాంతంలో మూడుసార్లు ప్రభుత్వ వైన్ షాపుల్లో దొంగతనాలు జరిగాయి. రాష్ట్రంలో కట్టడి పెరగడంతో లిక్కర్ దందా కొత్త ఎత్తులు మొదలు పెట్టింది. 


 
జిల్లాకు పొరుగునే ఉన్న ఒడిషా రాష్ట్రం నుంచి మద్యం దిగుమతి అవుతోంది. అక్రమ రవాణా కోసం  కోసం నదులు, కాలువలను ఎంచుకుంటున్నారు. సీలేరు, మత్స్యగెడ్డలు దాటి కోరాపుట్, మల్కన్ గిరి వంటి జిల్లాల నుంచి మద్యం విశాఖ జిల్లాలో ప్రవేశిస్తోంది. ఇటీవల భారీ స్థాయిలో ఒడిషా లిక్కర్ సీజ్ చేశారు పాడేరు ఎక్సైజ్ అధికారులు.  

 

మద్య నిషేధం అమలులోకి వచ్చిన తర్వాత విశాఖ ఏజెన్సీ, సరిహద్దు మండలాలతో పాటు సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో నాటుసారా అడ్డాలు మొదలయ్యాయి. బట్టీలు పెట్టి కాపుసారా తయారీ ప్రారంభించారు. గ్రామ వాలెంటీర్ల వ్యవస్థ ద్వారా వచ్చిన సమాచారంతో కాపు సారా కేంద్రాలను నియంత్రిస్తున్న సమయంలో లాక్డౌన్ ప్రారంభమైంది. మద్యం అమ్మకాలు ఆగిపోవడంతో విచ్చలవిడితనం పెరిగింది. విశాఖ జిల్లాలో నెలకు 180కోట్ల  మద్యం అమ్మకాలు జరుగుతాయి. రెండు లక్షల లిక్కర్...సుమారు మూడు లక్షల కేస్ ల బీర్లు సేల్స్ ఉంటుంది. సమ్మర్ సీజన్లో అమ్మకాలు బాగా పెరుగుతాయి.  


 
లాక్ డౌన్ వల్ల ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల్లో నెలన్నరగా షాపులు, బార్లు మూతపడ్డాయి. నాటుసారా తయారీ, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యానికి కట్టడి చేసేందుకు ఆబ్కారీ శాఖ జాయింట్  ఆపరేషన్ కు సన్నద్ధం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: