విశాఖలో ఓ వైపు కరోనా విజృంభిస్తుంది. మరోవైపు లాక్‌డౌన్‌తో రోజుల తరబడి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా ప్రజల్లో రోజురోజుకు మానసిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి...విచిత్రమైన ఆలోచనలతో  మనోవేదనకు గురవుతున్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని ఆందోళన చెందుతున్నారు.

 

విశాఖ నగర వాసుల్లో కరోనా ఫోబియా రోజురోజుకి ఎక్కువ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా నెలన్నర రోజులకు పైగా ఇళ్లకే పరిమితమయ్యారు. భవిష్యత్తుపై ఇప్పుడు బెంగ ఏర్పడింది. పదేపదే కరోనా వార్తలను టీవీల్లో చూస్తున్నారు. తమకు ఎక్కడ ఆ వైరస్ వ్యాపిస్తుందోననే భయం జనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. లాక్‌డౌన్ తొలగించిన తర్వాత బతకడం కష్టమనే మానసిక బలహీనత అధికమవుతుంది. 

 

అయితే ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటుపడిన జనం కరోనా కారణంగా రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కొంతమంది మానసికంగా కుంగిపోతున్నారు. లాక్‌డౌన్ అనంతర పరిణామాలను తలచుకొని వేదనకు లోనవుతున్నారు. ఈ విషయాలు మానసిక నిపుణులు పరిశోధనలో తేలాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు సమస్యలతో సలహాల కోసం ఫోన్లలో సంప్రదించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రోజుల తరబడి ఇళ్లలోనే ఏ పనీ లేకుండా కూర్చోవడం గతంలో ఎన్నడూ లేదు. దీనివల్ల మనసు చాలా విధాలుగా ఆలోచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనుల్లో బిజీగా ఉండడం వల్ల అనేక అంశాల గురించి ఆలోచిస్తూ మానసికంగా తీవ్ర కంగుబాటుకు గురవుతున్నట్లు నిపుణులు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వీలైనంత వరకు కరోనా వార్తలకు దూరంగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు.

 

ఇక...విశాఖలో ఇప్పటికే పలురకాల మానసిక సమస్యలతో నిపుణులను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరిగింది. కొవిడ్-19కు సంబంధించిన వార్తలను టీవీల్లో చూస్తుండడం, బయట నెలకొన్న వాతావరణం వల్ల పలువురు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. వైరస్‌కు సంబంధించిన ఏ చిన్న లక్షణం కనిపించినా అది తమకు సోకిందెమోననే భయాందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ ఇంకా ఎన్ని రోజులుంటుంది. ఇళ్లలోనే ఇంకా ఎన్నిరోజులు ఉండాలో అన్న ఆందోళన ఇలాంటి సమస్యలకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఉద్యోగ, ఆర్థికపరమైన ఇబ్బందులు గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వీలైనంత వరకు ఒంటరిగా కాకుండా అందిరితో కలిసి ఉండడం.. స్నేహితులు కుటుంబ సభ్యులతో గడపడం వంటివి చేయాలని చెపుతున్నారు మానసిక వైద్యులు.

 

అయితే కరోనా తర్వాత జాబ్ ఉంటుందా...పోతుందా.. అనే  భయమూ, ఆందోళన డిప్రెషన్‌కు కారణం అవుతున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం పోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి కొంతమందిని వెంటాడుతోంది. భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ పలువురు ఆత్మహత్య ఆలోచన చేస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కుటుంబపరమైన గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అనుమానం లాంటి సమస్యలు పెరిగాయి. స్కూల్స్, కాలేజీలు లేకపోవడంతో పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు చెబుతున్నారు వైద్య నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: