కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డ ఒలింపిక్స్... 2021లోనూ జరగవా? ఒలింపిక్స్ కూడా రద్దవుతాయా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?
క్రీడా పోటీల్లో అతిపెద్ద వేదిక ఒలింపిక్స్. టోక్యోలో ఈ ఏడాది ఆగస్టులో ఒలింపిక్స్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది జులైలో పోటీలు నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది చివరికి కరోనా ప్రభావం తగ్గకపోతే ఒలింపిక్స్ రద్దు చేస్తామని టోక్యో గేమ్స్ 2020 అధ్యక్షుడు యోషిరో మోరీ అంటున్నారు. దాంతో... ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్స్‌ని కూడా వాయిదా వేస్తారా? అనే చర్చ జరుగుతోంది.
ఒలింపిక్స్... తొలిసారి 1916లో రద్దయ్యాయి. నాలుగో ఒలింపిక్స్ జర్మనీలోని బెర్లిన్‌లో 1916లో జరగాల్సింది. బిడ్స్ సమయంలో ఈజిప్ట్, నెదర్లాండ్స్, బెల్జియం, హంగేరి, యూఎస్‌లను దాటుకొని బెర్లిన్‌లో మహాక్రీడలను జరపడానికి జర్మనీ అవకాశం కొట్టేసింది. అయితే 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతూనే ఉండటంతో ఆ ఏడాది ఒలింపిక్స్‌ను అధికారులు రద్దు చేశారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత అంటే 1936లో బెర్లిన్‌లో ఒలింపిక్స్ నిర్వహించారు.
1940లోనూ ఒలింపిక్స్ రద్దయ్యాయి. పన్నెండో ఒలింపిక్స్ జపాన్‌లోని టోక్యోలో 1940 సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 6 వరకు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో క్రీడా వేదికను ఫిన్లాండ్లోని హెల్సింకి ప్రాంతానికి మార్చారు. ఆ తర్వాత కూడా పోటీలను నిర్వహించే అవకాశం లేకపోవడంతో రద్దు చేశారు. అదే ఏడాది జపాన్‌లోనే వింటర్ ఒలింపిక్స్ నిర్వంహిచాలనుకున్నా.. యుద్ధం కారణంగా రద్దయింది.
1944లో కూడా ఒలింపిక్స్ రద్దయ్యాయి. వీటిని లండన్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధమైంది. కానీ రెండో ప్రపంచయుద్ధం కారణంగా ఈ క్రీడలు రద్దయ్యాయి. అయితే క్రీడాకారులు, క్రీడాభిమానులు నిరుత్సాహపడకూడదని... ఒలింపిక్స్ వార్షికోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆ ఏడాది నుంచే ఒలింపిక్ టార్చ్ రీలే ప్రారంభమైంది. అదే ఏడాదిలో ఇటలీలో జరగాల్సిన వింటర్ ఒలింపిక్స్ కూడా యుద్ధం కారణంగా రద్దయ్యాయి.
1948 నుంచి వరుసగా ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతూ వస్తున్న ఒలింపిక్స్... ఈ సారి కరోనా వల్ల వాయిదా పడ్డాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. 30 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ఇప్పట్లో అంతం కాకపోతే.. వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.