లాక్‌డౌన్ కారణంగా మనుషులకే కాదు మూగజీవాలకు కష్టాలు తప్పటం లేదు. అనేక దేవాలయాలు గోశాలలు నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో పశుగ్రాసం సమస్యలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం గోశాలల వైపు వెళ్లే వారెవరూ కనిపించడం లేదు. ఫలితంగా గోశాలలకు గడ్డి కరువు అవుతుంది. 

 

లాక్‌డౌన్‌తో మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గో సంరక్షణ కేంద్రాల్లో గోవులకు పశుగ్రాసం దొరకటం లేదు. గో సంరక్షణ కేంద్రాల్లో నిత్యం గో పూజలు జరుగుతుంటాయి. అయితే.. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ గోవులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఖమ్మంలో శ్రీకృష్ణ గోశాల, వెంకటేశ్వర స్వామి గోశాలలు ఉన్నాయి. ఈ గోశాలలు దాతల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. వీటికి ప్రత్యేకంగా ఎలాంటి ఆదాయ వనరులు లేవు. చాలా మంది దాతలు వీటికి గడ్డి, దాణా ఇతరత్రా సదుపాయాలను అందిస్తుంటారు. లాక్‌డౌన్ కారణంగా బయటకు వెళ్తే పోలీసులు వీపు విమానం మోత మోగిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎవ్వరు గోశాలల వైపు రావడం లేదు. ఫలితంగా గోవులకు గడ్డి, దాణా కరువైంది.

 

ఇక...గోశాలలు ఇబ్బందులు పడుతున్న విషయం ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చింది. దీనిపై సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకటవీరయ్య స్పందించారు. గోశాలలకు పెద్దఎత్తున గడ్డిని పంపిణి చేయాలని నిర్ణయించారు. తన నియోజకర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, విఎంబంజర మండలాల్లోని రైతుల వద్ద గడ్డిని సేకరించారు. ఖమ్మానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అక్కడి నుంచి గడ్డిని సుమారు 130 ట్రాక్టర్లలో తీసుకొచ్చారు. ఆ గడ్డిని ఖమ్మంలో ఉన్న రెండు గోశాలలకు అందించారు. పెద్ద సంఖ్యలో గోవులు ఉండడంతో స్పందించి తాను ఈ కార్యక్రమానికి పూనుకున్నానని చెప్పారు ఎమ్మెల్యే సండ్ర. గతంలో కూడా గోశాల నిర్మాణానికి తాను టీటీడీ నుంచి 27 లక్షల రూపాయలను మంజూరు చేయించానని గుర్తు చేశారు. ప్రధానంగా గోవులను ఆదుకోవాలని యువ నేత కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందించానని చెప్పారు ఎంఎల్ఎ సండ్ర.  మొత్తానికి...సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గోవులకు పశుగ్రాసం వితరణ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: