క్వార్టర్లీ ట్యాక్స్‌‌  చెల్లింపునకు రవాణా శాఖ మినహాయింపు ఇవ్వాలని...గూడ్స్, ప్రజా రవాణా వాహన యాజమానులు కోరుతున్నారు. లాక్ డౌన్ తో ఎక్కడి  వాహనాలు అక్కడే నిల్చిపోవడంతో ట్యాక్స్ లో మినహాయింపు తోపాటు...ఇన్స్యూరెన్స్ లోనూ సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

లాక్ డౌన్ వేళ గూడ్స్, ప్రజా రవాణా వాహనాదారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం లాక్​డౌన్​అమల్లో ఉండటంతో నెలరోజులకుపైగా చాలా వరకు లారీలు, డీసీఎంలు రోడ్డు ఎక్కలేదు. ఏప్రిల్ 30న సెకండ్ క్వార్టర్లీ ట్యాక్స్‌‌ గడువు ముగియడంతో ట్యాక్స్ కట్టాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ సమయంలో వాహనాలు తిరగకపోయినా,  ట్యాక్స్‌‌ ఎలా కట్టాలని గూడ్స్ వెహికిల్స్ ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు.

 

ఉమ్మడి వరంగల్ జిల్లా సుమారు 4 వేల లారీలు,  3 వేల డీసీఎంలు,  మరో 5 వేల చిన్న ట్రాన్స్ పోర్టు వాహనాలు ఉన్నాయి నిత్యం దేశంలోని వివిధ నగరాల నుండి  నిత్యావసర సరుకును రవాణా చేస్తాయి. ఇక భూపాలపల్లి  సింగరేణి నుండి పెద్ద ఎత్తున బొగ్గు రవాణా చేస్తాయి లారీలు.. అయితే కరోనా మహ్మమారి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. 

 

సుమారు 25 శాతం వాహనాలు మాత్రమే నిత్యావసర సరుకును రవాణా చేస్తుండగా.. మిగిలిన 75 శాతం వాహనాలు ఇంటికే పరిమితం అయ్యాయి. ఇక ప్రజా రవాణా వాహనాలు సుమారు 5 వేల కార్లు రోడ్డు ఎక్కలేదు. అయిన క్వార్టర్లీ  పన్నుపోటు తప్పట్లేదని వాహన యజమానులు వాపోతున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి మారిటోరియం ఇచ్చిన విధంగా,  తమకి సైతం వాహన పన్ను రద్దు చేయడంతో పాటు ఇన్సూరెన్స్‌ ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

క్వాటర్లీ  ట్యాక్స్ కట్టకుంటే ప్రతి నెలా 25 శాతం అదనపు ఛార్జీలతో చెల్లించాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వం సత్వరమే తమ డిమాండ్ పై స్పందించాలని గుడ్స్ వాహనాల ఓనర్లు కోరుతున్నారు.అలా కాకుండా తాత్సారం చేస్తే నిత్యావసరాలు, ధాన్యం, ఇతర సరుకులు రవాణా చేస్తున్న లారీలు, డీసీఎంలను బంద్​ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే కోర్టుకు సైతం వెళ్లాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: