లాక్ డౌన్ పై ఉత్కంఠ వీడింది. దేశ వ్యాప్తంగా రెండో దఫా లాక్‌డౌన్‌ గడువు మే 3తో ముగియనుండ‌గా...లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. శనివారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. కేంద్రం నిర్ణ‌యాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ పాటిస్తారా లేక త‌న రాష్ట్రంలో ప్ర‌త్యేకంగా నిర్ణ‌యం తీసుకుంటారా? అనే ఆస‌క్తి, ఉత్కంఠ కొన‌సాగుతోంది.

 

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ గ‌డువు మే 7తో ముగియ‌నుంది. మ‌రోవైపు మే 8 నాటికి రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుందని, తర్వాత కొత్త కేసులు నమోదు కాకపోవచ్చని ప్రభుత్వం ధీమాతో ఉంది. అయినప్పటికీ లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తివేస్తే ప్ర‌మాద‌మ‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ నెల 5న‌ తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ను మ‌రింత‌ పొడిగించాలా..? లేదంటే దశల వారీగా ఎత్తివేయాలా? అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, గ‌తంలో కేంద్రం ప్ర‌క‌టించిన మే 3 లాక్ డౌన్ తేదీని కాద‌ని మే 7వ తేదీ వ‌రకు లాక్ డౌన్ కొన‌సాగించాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు.

 


అయితే, కేంద్రం నిర్ణ‌యం వెలువ‌డిన అనంత‌రం కేబినెట్ స‌మావేశంలోనే తాము లాక్ డౌన్‌ గ‌డువుపై తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. ఇప్పుడు కేంద్రం విధించిన గ‌డువును అనుస‌రించే లాక్ డౌన్‌ను తెలంగాణ‌లోనూ అమ‌లు చేస్తారా లేక‌పోతే ప్ర‌త్యేకంగా నిర్ణ‌యం తీసుకొని మ‌రికొన్ని రోజుల పాటు కొన‌సాగిస్తారా అనే ఆస‌క్తి నెల‌కొంది. అయితే, కేంద్రం నిర్దేశించినంత స‌మ‌యం మాత్రం అమ‌లు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: