కరోనా టెస్టుల సంఖ్యని పెంచాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్లని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో వైసీపీ కమిషన్ కొట్టేసిందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు, టీడీపీ నేతలు ఆరోపణలు చేసారు. ఇవే కిట్లని ఛత్తీస్ ఘడ్ తక్కువ రేటుకు కొనుగోలు చేస్తే మీరు ఎక్కువ రేటుకు ఎలా కొంటారని ప్రశ్నించారు.

 

ఇక వారి విమర్శలకు అప్పుడే విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఈ కిట్లు డైరక్ట్ దక్షిణ కొరియాలో తయారైనవని, ఛత్తీస్ ఘడ్ కొన్నవి ఇండియాలో తయారైనవని, ఇవి 30 నిమిషాల్లో ఫలితాన్ని ఇస్తాయని, అదే కొరియా నుంచి వచ్చినవి 10 నిమిషాల్లో ఫలితం వస్తుందని చెప్పారు.

 

అయితే ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఏపీ ప్రభుత్వం కూడా కౌంటర్ ఇస్తూ, తాము కిట్లు కొనేటప్పుడే, ఏ రాష్ట్రానికైనా తక్కువ రేటుకు ఇస్తే, అదే రేటు కూడా ఇస్తామని కండిషన్ పెట్టినట్లు చెప్పారు. అంటే ఛత్తీస్ ఘడ్ కిట్లు, ఏపీకి వచ్చిన కిట్లు ఒకటే కదా అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరి విజయసాయి అలా ఎందుకు తేడాగా చెప్పారని ప్రశ్నించారు.

 

సరే ఆ విషయం ఎలాగోలా సద్దుమణిగిందనుకునే సమయంలో విజయసాయి మళ్ళీ కొరియా కిట్లు గురించి మాట్లాడారు. శవ రాజకీయాల కోసం చంద్రబాబుకు మరణ మృదంగం మోగుతుండాలని, కరోనా మరణాలు రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఉండటంతో దిక్కుతోచడం లేదాయనకు అంటూ బాబుపై మండిపడ్డారు. అలాగే 2 లక్షల టెస్టింగ్ కిట్లను కొరియా నుంచి కొన్నది దేశం మొత్తం మీద ఆంధ్రానేనని, ఇలాంటివి కనిపించవని అన్నారు.

 

ఇక వీటికి కూడా తమ్ముళ్లు కౌంటర్లు ఇస్తున్నారు. కొరియా నుంచి కిట్లు వచ్చిన మొదట్లో విజయసాయి, సోషల్ మీడియాలో దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయని, ఎల్లో వైరస్ ఇక జాగారం చేయాల్సిందే అంటూ ఎద్దేవా చేసారని, అప్పుడు లక్ష చెప్పిన ఆయన, ఇప్పుడు రెండు లక్షలు అని ఎలా చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంకా 2 శాతం మరణాలు వచ్చాయని బాబుకు దిక్కుతోచడం లేదని అంటున్నారని, అసలు ఆ 2 శాతం మరణాలు తక్కువ కాదని, అసలు ఒక మనిషి చనిపోవడమే చాలా దారుణమని, అలాంటిది 2 శాతం మరణాలు అని ఎలా చెప్పుకోగలుగుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: