ప్రపంచ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భార‌త్‌లోని ప‌రిస్థితుల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్ డౌన్ విధిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, భార‌త్‌లోనే త‌మ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంద‌ని పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా ఇండియాలో కేవలం అత్యవసర సరుకుల డెలివరీకి మాత్రమే పర్మిషన్ ఉందని… తమ నష్టాలకు ఇదే కారణమని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ తెలిపారు.  ఇండియాలో ఇది తమ ఒక్కరి సమస్య మాత్రమే కాదని పేర్కొన్న అమెజాన్ అన్ని సంస్థలపై ఇదే ప్రభావం ఉందని చెప్పారు. లాక్ డౌన్ పూర్తైన తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఇక త‌మ సిబ్బందికి కరోనా టెస్టులు చేయించడంతో పాటు… ఓవర్ టైమ్ చేస్తున్న వారికి తాత్కాలికంగా వేతనాలను పెంచామని బ్రయాన్ ఓస్లాస్కీ తెలిపారు.

 

ఇదిలాఉంగా, ఇటీవ‌ల అమెజాన్‌కు అమెరికాలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. అమెరికాలోని అమెజాన్ వేర్ హౌస్ (గిడ్డంగి) ఉద్యోగులు నిరసనకు దిగారు. గ‌త ఏప్రిల్ నెల 21వ తేదీ (అమెరికా కాలమానం ప్రకారం  ఉద‌యం) నుండి 500 మంది కార్మికులు నిరసనకు దిగుతున్నట్లు ‘యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్’ అనే కార్మికుల హక్కుల సంఘం తెలిపింది. కరోనా వ్యాప్తి చెందిన గిడ్డంగుల వద్ద సురక్షితమైన మాస్కులు అందించాలని, జీతంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. అమెజాన్‌కు ఆదాయం తప్ప ఉద్యోగుల బాగోగులు పట్టవని అక్కడి ఉద్యోగులు తెలిపారు. కరోనా పాజిటీవ్ నమోదైన గిడ్డంగులను వెంటనే మూసివేసి రక్షణ చర్యలు చేపట్టాలని గిడ్డంగులను సానిటైజ్ చేయాలని కోరారు. నిరసన చేస్తున్న వారిని విధులనుంచి తొలగించవద్దని డిమాండ్ చేశారు.తమకు తక్షణమే రెండు వారాల వేతనంతో పాటు సిక్ లీవ్స్‌ను మంజూరు చేయాలని కోరారు.

 

కాగా, ఈ ఆందోళ‌న జ‌రిగే నాటికి అమెరికాలోని అమెజాన్ గిడ్డంగుల్లో 130కి పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంపై గతంలోనే స్పందించిన అమెజాన్ యాజమాన్యం టెంపరేచర్ చెకింగ్, మాస్క్‌లు, శానిటైజర్‌లను కార్మికులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. దానికి కొన‌సాగింపుగా వివిధ దేశాల్లోనూ తమ ఉద్యోగుల‌కు ఈ సేవ‌లు అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: