ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ప్రయోజనం చేకూరేలా జగన్ ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం ఉల్లి పంట విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉల్లి పంటను ఎక్కువగా పండిస్తారు. కానీ జిల్లాలో రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో కేంద్రం కర్నూలును రెడ్ జోన్ గా ప్రకటించింది. 
 
రెడ్ జోన్ ప్రకటనతో కర్నూలులో ఉల్లి పంటను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు రైతులు నష్టాలకు పంటను లోకల్ వ్యాపారులకు అమ్ముకుంటుంటే... మరికొందరు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. తాజాగా సీఎం ఆదేశాలతో ప్రభుత్వం ఉల్లి రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని కన్నబాబు ప్రకటించారు. 
 
వ్యాపారులు నాణ్యత లేదనే కారణంతో టమాటా ధరను తగ్గిస్తున్నారని... టమాటా పంటను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తామని తెలిపారు. ఒంగోలును రెడ్ జోన్ గా ప్రకటించడంతో నగర శివారు ప్రాంతాలలో రెండు వేలం కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు రైతు భరోసా పథకంలో అర్హులను తొలగించారని ఆరోపణలు చేస్తున్నాడని ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. 
 
రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచామని... రైతులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వ్యవసాయ సహాయకునికి ఫిర్యాదు చేయాలని అన్నారు. సీఎం జగన్ నిన్న విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించారు. అధికారులు జగన్ కు 81 శాతం ఫీడర్లలో కరెంట్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామని చెప్పగా రబీ నాటికి 100 శాతం ఫీడర్లలో 9 గంటల పగటిపూట కరెంట్ ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు.                    

మరింత సమాచారం తెలుసుకోండి: