ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆచూకిపై ఉత్కంఠ నెల‌కొంది. ఏప్రిల్ 11 తర్వాత కిమ్ పబ్లిక్‌గా కనిపించలేదు. ముఖ్యమైన జాతీయ పండుగల సందర్భంగా కూడా ఆయన బయటకు రాకపోవడంపై పలు సందేహాలు, ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కార్యక్రమాలకు దూరంగా ఉన్న కిమ్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఓ సంచ‌ల‌న అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వారం కిందటే చనిపోయారని ఆ దేశానికి చెందిన జి సియాంగ్‌ హో తెలిపారు. 

 

జి సియాంగ్ హో ఉత్త‌ర కొరియా వాసి. దక్షిణ కొరియాకు వలస వెళ్లిన‌ ఆయన, గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఉత్త‌ర కొరియాలోని ప‌రిస్థితుల‌పై ఆయ‌న అవ‌గాహ‌న ఉంది. ఈ నేప‌థ్యంలో స్థానిక యోన్‌హాప్‌ వార్త సంస్థతో జి సియాంగ్‌ మాట్లాడుతూ.. తనకు అందిన సమాచారం ప్రకారం శస్త్ర చికిత్స తర్వాత కిమ్‌ మరణించినట్లు 99 శాతం కచ్చితంగా చెప్పగలనని జి సియాంగ్‌ హో అన్నారు. వారసుల ఎంపిక స్పష్టత వచ్చాక కిమ్‌ మరణాన్ని అధికారంగా ప్రకటించవచ్చని జి సియాంగ్ క్లారిటీ ఇచ్చారు.

 

 

ఇదిలాఉండ‌గా, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఉత్తర కొరియా అధినేత కిమ్ గురించిన ప్రశ్న ఆయ‌న‌కు ఎదుర‌వ‌గా దానికి పాంపియో ముక్తసరిగా స్పందించారు. `కిమ్ గురించి‌ అమెరికా దృష్టికి ఆయన రాలేదు.. ఆయన ఆరోగ్యం గురించిన సమాచారాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం' అని సమాధానమిచ్చారు. 'ఇవ్వాళటికైతే ఎలాంటి సమాచారం లేదు' అని ఆయన చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం కరోనా వల్ల కరువు ముప్పు ఉన్నదని, అది ఉత్తర కొరియాకూ ఉంటుందని పాంపియో చెప్పారు. 'ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహితం చేయాలన్న మన లక్ష్యానికి దగ్గరి సంబంధమున్న అంశాలివి. వీటిని జాగ్రత్తగా గమనిస్తున్నాం' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: