అగ్ర‌రాజ్యం అమెరికాలో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. వ‌చ్చే న‌వంబ‌ర్ 3న జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్రస్తుత అధ్య‌క్షుడు, రిప‌బ్లిక‌న్ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్ పై డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జో బిడెన్ పోటీ చేస్తున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌చారంలో క‌రోనా సంక్షోభంలో చిక్కుకున్న అమెరికాకు ఇప్పుడు జోబిడెన్ నాయ‌క‌త్వం అత్య‌వ‌స‌ర‌మ‌ని డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్‌పై పోటీచేసి ఓడిపోయిన హిల్ల‌రీ క్లింట‌న్ అన్నారు. బిడెన్ గొప్ప నాయ‌కుడ‌ని కొనియాడారు. మీరు అధ్య‌క్షుడు కావ‌టానికి నేను సంపూర్ణంగా మ‌ద్ద‌తు తెలుపుతున్నాను. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మీరే అధ్య‌క్షుడుగ ఉండాల‌ని కోరుకుంటున్నాను అని ఆమె ప్ర‌క‌టించారు. టీవీల ముందు న‌టించే వ్య‌క్తికాకుండా అస‌లైన అధ్య‌క్షుడు ఇప్పుడు అమెరికాకు కావాల‌ని ఆమె ప‌రోక్షంగా ట్రంప్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

 

అయితే, ఇలా డెమోక్రాట్లు ఎంతో ఆశ‌లు పెట్టుకున్న జో బిడెన్ ఇరకాటంలో ప‌డిపోయారు. వ‌చ్చే న‌వంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న జోబిడెన్ లైంగిక వేధింపుల‌కు గురిచే వ్య‌క్తి అని మాజీ సెనేట్ ఉద్యోగి తారా రీడ్ సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బిడెన్ స్పందించారు. త‌న‌పై వ‌చ్చిన లైంగిక‌వేధింపుల ఆరోప‌ణ‌లు ఖండించారు. తారా రీడ్ చేసిన ఆ ఆరోప‌ణ‌ల్లో నిజంలేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌పై అలాంటి ఫిర్యాదు రికార్డు అయ్యిందేమో నేష‌న‌ల్ ఆర్కైవ్‌లో వెతుక్కోవాల‌ని త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు సూచించారు. అధ్య‌క్ష అభ్య‌ర్థి అయిన త‌ర్వాత మొద‌టిసారి ఆయ‌న ఓ టీవీ చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌బోతున్నారు. ఆ ముఖాముఖిలో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై స‌మాధానం ఇవ్వ‌నున్నారు.

 

కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల చేశారు. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ ఎన్నికవ్వడం చైనాకు ఇష్టం లేదని ‌ అన్నారు. చైనాపై తాను విధిస్తున్న బిలియ‌న్‌ డాలర్ల దిగుమతి సుంకాలు అందుకు కారణమని చెప్పారు. తనకు బదులు డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్‌ను అమెరికా తర్వాతి అధ్యక్షుడిగా చూడాలని చైనా భావిస్తున్నందున ట్రంప్‌ ఆరోపించారు. డెమోక్రాట్ల హ‌యాంలో చైనా అమెరికాను అన్ని విధాలుగా దోచుకుంద‌ని, అందుకే ఇప్పుడు జో బిడెన్ అమెరికాకు అధ్య‌క్షుడు కావాల‌ని చైనా కోరుకుంటున్న‌ద‌ని ట్రంప్ ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క‌రోనా వైరస్‌ వ్యాప్తి విష‌యంలో డ్రాగన్‌ దేశాన్ని సమర్థించే ప్రసక్తే లేదని ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ ఆరోప‌ణ‌ల‌పై ఇటు చైనా, అటు డెమోక్రాట్లు మండిప‌డుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: