దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది.  కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను ఈ వైరస్ చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని వనస్థలిపురంలో కరోనా భారీన పడి తండ్రీ కొడుకు మృతి చెందారు. మూడు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఒకే కుటుంబంలో ఆరుగురు కరోనా భారీన పడగా మూడు రోజుల క్రితం వృద్ధుడు చనిపోయాడు. వృద్ధుడు మరణించిన తరువాత కరోనా నిర్ధారణ అయింది. నిన్న సాయంత్రం ఆయన కొడుకు చికిత్సకు కోలుకోలేక మృతి చెందాడు. ఒకే కుటుంబంలో మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న మరణించిన వ్యక్తి సోదరుడి నుంచి కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకిందని సమాచారం. 
 
మలక్ పేటలో నూనె వ్యాపారంచేసే వ్యక్తి జ్వరం రావడంతో అతని సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ వ్యక్తిని చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి పంపారు. ఆ వ్యక్తి నుంచి అతని తండ్రికి, సోదరునికి, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. మూడు రోజుల క్రితం మృతి చెందిన వృద్ధుడు షుగర్, బీపీ, ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడని సమాచారం. తాజాగా ఆయన రెండో కుమారుడు చికిత్సకు కోలుకోలేక మృతి చెందాడు. 
 
జీ.హెచ్.ఎం.సీ సిబ్బంది వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధుడి కుటుంబ సభ్యులంతా క్వారంటైన్ లో ఉండటంతో జీ.హెచ్.ఎం.సీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం వీరు నివశిస్తున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది. అధికారులు ఆ ఏరియాలో నివశించే 40 కుటుంబాలను హోం క్వారంటైన్ చేశారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: