ఆటో అన్నల బతుకు బండికి లాక్ పడింది. లాక్ డౌన్ విధించిన దగ్గర నుండి వేల సంఖ్యలో ఆటోలు స్టాండ్ లకే పరిమితమయ్యాయి. నెలన్నర రోజుల నుండి ఎటూ కదలకుండా ఖాళీగా పడున్నాయి. కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో విధంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు విశాఖ నగర ఆటోవాలాలు. 

 

విశాఖలో ఆటోవాలాలపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆటో తిరిగితే తప్ప వీరి ఆకలి తీరదు. లాక్‌డౌన్‌తో రవాణా ఆగిపోయింది. ఆటోడ్రైవర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఇప్పటికే జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయి. 5 వేలకు పైగా ప్రయాణీకుల ఆటోలు, సరుకు రవాణా ఆటోలు ఉన్నాయి. వీటిపైనే ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. రోజుల తరబడి ఆటోలు ఆగిపోవడంతో వీరి పరిస్థితి దారుణంగా తయారైంది. పూట గడవడమే కష్టంగా మారింది. 70 శాతం ఆటోలు బ్యాంకులు...ఫైనాన్స్‌ కంపెనీల ద్వారా తీసుకున్నవే. నెల తిరిగేసరికి బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలకు మనీ కట్టాల్సిందే. ఈఎమ్ ఐలు కనీసం ఐదు వేలకు తక్కువ ఉండే అవకాశం లేదు. ఈ  విషయంలో ఆర్బీఐ ఊరటనిచ్చినా వడ్డీ పడుతుండడంతో ఫైనాన్సర్లు ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఆటోడ్రైవర్లు మానసిక ఒత్తిడికి లోను కావటానికి కారణమవుతోంది. విధి లేక రోడ్ల మీదకు వచ్చి కేసుల బారినపడుతున్నారు. పోలీసులు ప్రతీరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. 

 

విశాఖలో వేలాది మంది ఆటోలు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజంతా కష్టపడితే వచ్చే ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఫైనాన్సులు, ఇంటి అద్దెలు కట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లపై భారం రోజురోజుకి పెరిగిపోతుంది. ఏపీలో ప్రభుత్వం గతంలో ఆటో వాలాలకు ఇచ్చిన 10 వేల రూపాయలను కరోనా కష్ట కాలంలో కూడా చెల్లించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఆటో యూనియన్లు. ఎలాంటి బేరాలు బుకింగ్ లు లేక ఒక్కసారిగా జీవనచక్రం ఆగిపోయింది. కనీసం పాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవంటూ వాపోతున్నారంటే పరిస్థితి ఏ మాదిరిగా తయారయిందో అర్థమవుతోంది. 

 

నగరంలోని జగదాంబ, పూర్ణా మార్కెట్, అల్లిపురం, దాబా గార్డెన్స్ పరిధిలో వందలాది ఆటోలు తిరిగేవి..కానీ ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌.. ఎందరో జీవితాలతో ఆటలాడుతోంది.. నెలన్నార రోజులుగా ఎక్కడివారక్కడే. ప్రతీ రోజూ  గిర్రున  తిరిగే  జీవన చక్రం ఒక్కసారిగా ఆగిపోయింది.. ఆటో డ్రైవర్ల బతుకు డౌన్‌ అయింది. ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలను అతలాకుతలం చేసింది.. దేశం అంతటా రవాణా ఆగిపోవడంతో వారి బతుకు ఆగమ్యగోచరంగా మారింది. ఈ నెలంతా ఇంట్లోనే గడచిపోయింది..  పైసా ఆదాయం లేదు.. దమ్మిడీ రాబడి లేదు.. ఫైనాన్స్‌లు కట్టాల్సిన సమయం రానే వచ్చింది.. మరిప్పుడెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

లాక్‌డౌన్‌ అమలుతో రవాణారంగం అతలా కుతలమైంది. ప్రధానంగా ఆటో డ్రైవర్లు ఉదయం నుండి రాత్రి వరకు తిరుగుతునే ఉంటారు. వారంతా ఒక్కసారిగా కనీసం నిర్వహణకు పైసా ఆదాయం లేకుండా పోయింది. జిల్లాలో ఉన్న దాదాపు వేల ఆటోల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బయట నుండి రాకపోకలు ఆపేసారు..కనీసం లోకల్ గా కూడా ఎలాంటి బుకింగ్స్ లేకపోవడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అంతే కాకుండా మే 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ పొడిగించడంతో ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత అయినా..ఎప్పుడు ఆటోలు నడపడానికి పర్మిషన్ ఇస్తారో తెలీడం లేదంటూ వాపోతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: