ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది ప్రత్యేకమైన శైలి. ఇప్పటిదాకా ఏపీని పాలించిన చంద్రబాబు ప్రజలకు ఒక రకమైన ట్రెండ్ చూపించారు. రాజకీయాలు అంటే ఇలాగే చేయాలన్న భావన ప్రజలకు కలిగించారు. ఇక పాలన అంటే కూడా ఇదేనని బాబు మార్క్ బ్రాండ్ వేశారు. ఒక విధంగా ముమ్మారు ఏపీ సీఎం గా పనిచేసిన బాబు వేసిన గట్టి ముద్ర నుంచి బయటకు రావడం, జనాలను ఆ వైపు నుంచి తన వైపుగా తిప్పుకోవడం కష్టమైన పని.

కానీ జగన్ ఈ విషయంలో నిదానమే ప్రధానం అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. జగన్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఆయన ఎక్కువగా మాట్లాడరు. పని మాత్రమే మాట్లాడాలి. ఈ రకమైన టెండెన్సీకి ఇపుడిపుడే ప్రజలకు  కూడా అలవాటు చేస్తున్నారు. అది కరోనా వైరస్ ని వైసీపీ సర్కార్ ఎదుర్కొనే విషయంలోనే జనాలకు మెల్లగా  బోధపడుతోంది. 

 

ఇదిలా ఉండగా జగన్ కి ఇప్పటివరకూ ముఖ్యమంత్రుల్లో దోస్త్ ఎవరైనా అంటే అది కేసీయార్ మాత్రమే. ఏపీలో ఎన్నికలు జరగకుండానే కేసీయార్ జగన్ని ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించారు. ఆ తరువాత ఎటూ జగన్ సీఎం అయ్యారు. ఆ ప్రమాణ స్వీకారానికి కేసీయార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  ఇక జగన్ కి ముఖ్యమంత్రులో మరో మిత్రుడిగా పొరుగున ఉన్న ఒడిషా సీఎం కనిపిస్తున్నారు.

 

దాదాపు డెబ్బైలకు చేరువలో ఉన్న నవీన్ పట్నాయక్ ఇప్పటికి రెండు దశాబ్దాలుగా ఎటువంటి ఓటమి లేకుండా గెలుస్తున్నారు. ఆయన అక్కడ జనాలకు దేవుడు. ఆయన కూడా జగన్ మాదిరిగానే రాజకీయ వారసుడిగా వచ్చారు. అటువంటి నవీన్ జగన్ పాలన భేష్ అని మెచ్చుకున్నారు. ఇద్దరు సీఎంలు కలసి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఒడిషాకే చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా జగన్ ఈ వీడియో సమావేశంలో మాట్లాడారు.

 

ఇవన్నీ చూసినపుడు జగన్ కి జాతీయ రాజకీయాలలో  కొత్త నేస్తాలు, చుట్టాలు కలుస్తున్నారనుకోవాలి. ఏపీలోనే ఉంటూ అడుగు కూడా కదలకుండా జగన్ తనతో కలసివచ్చేవారిని మిత్రులుగా చేసుకుంటున్నారు. ఇది నిజంగా ఏపీకి సంబంధించి  సానుకూలమైన అంశమేనని అంతా అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: