వరంగల్ ఫ్రూట్  మార్కెట్ లో దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది.. లాక్ డౌన్ తో ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనేందుకు రాకపోవడంతో,  స్థానిక దళారులు మామిడి రైతులను నిలువునా ముంచుతున్నారు. దీంతో పెట్టుబడి రాక అప్పులతో ఇంటికి వెళుతున్నారు రైతులు. 



మామిడి రైతులకు దళారీలు షాక్ ఇస్తున్నారు . కరోనా లాక్ డౌన్ తో సతమతమవుతున్న మామిడి రైతులను దళారులు విడిచిపట్టడం లేదు. సీజన్‌ ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో ధరలు నిర్ణయించి కొనుగోలు చేసిన వ్యాపారులు..  కీలక తరుణంలో ఒక్కసారిగా రేటును తగ్గించేశారు. 


మామిడిలోనే శ్రేష్ఠమైన బంగినపల్లి రకం పండ్ల ధర క్వింటాల్‌పై రూ.1000 నుండి రూ.2000లకు పాట పాడుతున్నారు.  అత్యుత్తమ  మామిడి కాయలు అయితే మాత్రం రూ.3000 పాట పాడుతున్నారు. అందులోనూ గ్రేడింగ్ చేయడానికి అనుమతి ఇస్తేనే.. ఆ రేటు ఇస్తున్నారు. ఇక తోతాపురికి 600 మాత్రమే పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎంతో ఆశతో మార్కెట్ కి వచ్చిన రైతులకు నిరాశ తప్పడం లేదు. ధర తగ్గించడమే కాదు..  10 శాతం  కమిషన్ వసూలు చేస్తూ , మామిడి రైతులను నిలువునా  ముంచేస్తున్నారు..దళారులు.


తెలంగాణలో గత ఏడాదితో చూసుకుంటే ఈ ఏడాది  మామిడి పంట దిగుబడి తగ్గింది. మారిన  వాతావరణం ఈదురు గాలులతో  దిగుబడిపై ప్రభావం చూపింది. కరోనా రూపంలో  మామిడి రైతులపై మరో దెబ్బ తగిలింది.  వరంగల్ నుండి  ఉత్తర ప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేస్తుంటారు. దీంతో వరంగల్ పండ్ల మార్కెట్లో అమ్ముకోవడానికి వరంగల్, ఇతర జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల నుండి కూడా మామిడి రైతులు పెద్ద ఎత్తున వరంగల్ మార్కెట్ కు మామిడి కాయలు తీసుకొస్తారు. అయితే కరోనా లాక్ డౌన్ ఎఫెక్టు తో ఇతర రాష్ట్రాల వ్యాపారులు వరంగల్ కు రాలేని పరిస్థతి. దీంతో స్థానిక వ్యాపారులది ఆడిందే ఆట.. పాడిందే పాట గా మారింది. 


వరంగల్ ఫ్రూట్ మార్కెట్ దళారుల దందా బహిరంగంగా జరుగుతూనే ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ధర తగ్గించినా వెనక్కు తీసుకెళ్లలేక,  గత్యంతరం లేని పరిస్థితుల్లో  రైతులు తెగనమ్ముకుని వెళ్లిపోతున్నారు. తక్కువ ధరకే కొనుగోలు చేసిన వ్యాపారులు నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముకుంటూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. 


నిజానికి మామిడి కాయలు కొన్న వ్యాపారులు కమిషన్ 4 శాతం మేర తీసుకోవచ్చు కానీ,  మార్కెట్ కు కమిషన్ కట్టాలంటూ 10 శాతం రైతుల నుండి వసూలు చేస్తున్నారు. కిందటేడాది టన్నుకు 40 నుంచి 60 వేలు పలికిన మామిడి ధర, ఈ సంవత్సరం15 నుంచి 30 వేలు మాత్రమే పలుకుతోంది. 


ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రైతుకు భారీ స్థాయిలో అన్యాయం జరుగుతున్నా, నివారించే చర్యలు చేయకపోవడం పై పలు విమర్శలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: