ప్లాస్మా థెరపీ ప్రయోగ దశలోనే వికటిస్తోంది..! ముంబైలో ప్లాస్మా థెరపీ ద్వారా వైద్యం అందుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్లాస్మా థెరపీ కరోనాకు విరుగుడు కాకపోయినా... ప్రయోగాత్మకంగా పరిశీలించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. మరోవైపు తమ రాష్ట్రంలో మాత్రం ప్లాస్మా థెరపీ ప్రయోగాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.

 

మహారాష్ట్రలో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందిన తొలి కరోనా రోగి మృతి చెందాడు. వైద్యులు అతడిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.  ముంబై లీలావతి ఆస్పత్రిలో  బాధితుడికి ప్లాస్మా థెరపీ మొదలుపెట్టిన 24 గంటల తరువాత అతడి ఆరోగ్యం మరింతగా క్షీణించడం మొదలైంది. దీంతో డాక్టర్లు అతడికి వెంటిలేటర్ అమర్చారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స తీసుకుంటున్న రోగి కోలుకుంటున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించిన కొద్ది గంటల్లోనే బాధితుడు చనిపోయాడు.

 

బాధితుడికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు వివరించారు. ఆస్పత్రిలో చేర్పించిన వెంటనే అతడి పరిస్థితి గమనించి మెరుగైన చికిత్స అందించామని.. కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి నుంచి ప్లాస్మా సేకరించి కొద్ది రోజుల కిందట 200 ఎంఎల్ డోస్ ఇచ్చామని తెలిపారు. అంతకుముందు ఇతర ఔషధాలతో ప్రయత్నించామని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి బాగా విషమించిన వారికే ప్లాస్మా థెరపీ విధానం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

 

మరోవైపు.. ప్లాస్మా థెరపీ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, ఈ చికిత్సా విధానాన్ని కొనసాగిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ కరోనా రోగి పరిస్థితి విషమించడంతో అతడికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిచామని.. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడని ఆయన వివరించారు. ఇప్పటికే కోలుకున్న 1100 మందితో ప్లాస్మా దానంపై సంప్రదింపులు జరుపుతున్నామన్నారు కేజ్రీవాల్.

 

కరోనాకు మందులు లేవు... వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ప్లాస్మా థెరపీపై ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు ICMR ఇప్పటికే అనుమతిచ్చింది. అయితే దీన్ని  అందరు కరోనా పేషెంట్లపై ప్రయోగించకుండా...ప్రయోగాత్మకంగానే పరిశీలించాలని స్పష్టం చేసింది.  దీంతో కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్మా థెరఫీ చికిత్స అందిస్తున్నారు. మొత్తంమీద కరోనా వైరస్‌ చికిత్సకు ఆశాకిరణంగా కనిపించిన ఈ ప్లాస్మా థెరపీ వికటించి ఓ బాధితుడు మృతి చెందడం కలకలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: