ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ పార్టీలు ప్రతి విషయంలోను భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తాయన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఒక పార్టీ నేతలపై మరొక పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా మంత్రి అనిల్ కుమార్ టీడీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి పలు విషయాలు చర్చించారు. 
 
కొన్ని రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడిని తీర్చాలని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావులు రాసిన లేఖపై మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. ఎమ్మెల్యేలు వేసవి కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో నీటి సమస్యలపై దృష్టి పెట్టాలని కోరగా మంత్రి ఆ లేఖకు సానుకూలంగా స్పందించడంతో పాటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో మాట్లాడారు. 
 
జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రి టీడీపీ ఎమ్మెల్యేకు మాట ఇచ్చారు. గతంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డితో ఈ అంశం గురించి చర్చించానని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఒంగోలు కలెక్టర్ తో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుంటానని.... అనంతరం సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. 
 
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించిన తీరుపై నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. మిగతా మంత్రులు కూడా ఇదే బాటలో నడిస్తే బాగుంటుందని ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పార్టీలు కలిసి పని చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ప్రతిపక్షం చేసే విమర్శలను విమర్శలా భావించకుండా ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవడం... అధికార పక్షం ప్రతిపక్షంపై అసత్య ఆరోపణలు చేయకుండా ఇరు పార్టీలు కలిసి పని చేస్తే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: