హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మామూలు రోజుల్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలబడిపోవడం, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఇలా మహానగరం ట్రాఫిక్ క‌ష్టాలు అంద‌రికీ అనుభ‌వంలో ఉన్న‌వే. అయితే,  ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నది కాబట్టి ట్రాఫిక్ కు సంబంధించిన కష్టాలు తెలియడం లేదు. కానీ ఈ లాక్ డౌన్ వ‌ల్లే హైద‌రాబాద్‌లో మార్పు రానుంద‌ట‌. కరోనా పుణ్యమా అని వచ్చిన లాక్‌డౌన్ స‌ద్వినియోగం చేసుకొని లాక్ డౌన్ తరువాత నగర ప్రజలు ట్రాఫిక్ లేని హైదరాబాద్ ను చూసేలా తీర్చిదిద్దాల‌ని మంత్రి కే‌టీఆర్ ఆదేశించారు.

 

హైదరాబాద్ రోడ్ల నిర్మాణం పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల నిర్మాణ పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించిన ఆయ‌న ఈ నెల రోజులలోపుగా హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణ, మెయిన్ ట్రాఫిక్ జామ్ ఏరియాలను గుర్తించి అక్కడ రోడ్లు విస్తరించడం, లింక్ రోడ్లను అనుసంధానం చేయడం వంటివి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. నిర్మాణ పనులకు, భూసేకరణకు నిధుల కొరత లేదని పేర్కొంటూ నిర్వాసితుల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని మంత్రి అధికారులకు సూచించారు. లాక్ డౌన్ పూర్తయ్యి వాహనాలు రోడ్డుమీదకు వచ్చిన తరువాత ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా రోడ్ల విస్తరణ జరగాలని కేటీఆర్ సూచించారు. 

 


ప్రస్తుతం నగరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు పోవాలని కేటీఆర్ తేల్చి చెప్పారు. ``ఇది వర్కింగ్‌ సీజన్‌..ఒక నెలపాటు పనులు చేయవచ్చు. జూన్‌ నుంచి వర్షాలు వస్తాయి. హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం. 'జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్‌ రోడ్ల వెడల్పు 120 అడుగులు ఉండాలి. ఎస్‌ఆర్‌డీపీ, లింక్‌, సర్వీస్‌ రోడ్లను పొడిగించేందుకు హెచ్‌ఎండీఏ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలి. భవిష్యత్‌ అవసరాలు, పెరిగే ట్రాఫిక్‌ రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలి. హైదరాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేస్తాం. రైల్వే అండర్‌ పాస్‌లు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలతో పాటు, కొత్త ప్రాజెక్టులకు కూడా అవసరమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను' మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ ఆదేశాలు ఫ‌లించి ప‌నుల‌న్నీ పూర్త‌యితే... నిజంగానే లాక్ డౌన్ త‌ర్వాత ఆహ్లాద‌క‌ర‌మైన హైద‌రాబాద్‌ను మ‌నం చూడ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: