కోడెల శివప్రసాద్...రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. అవకాశాలు వస్తే పార్టీలు మారిపోయి ఈరోజుల్లో...టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవులు చేపట్టి, రాష్ట్రం విడిపోయాక ఏపీకి తొలి స్పీకర్ గా పనిచేసారు. అయితే 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి కోడెలపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.

 

అటు ఆయన కుమారుడు, కుమార్తెలపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఫర్నిచర్ కోడెల ఇంట్లో పెట్టుకున్నారని పలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల క్రమంలో కోడెల ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఏ పార్టీలో అయితే రాజకీయ జీవితం మొదలుపెట్టారో అదే పార్టీ జెండాతోనే చనిపోయారు.

 

అయితే కోడెల చనిపోయాక, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు. వైసీపీ ఒత్తిడి వల్లే చనిపోయారంటూ ఫైర్ అయిపోయారు. అటు వైసీపీ నేతలు కూడా బాబు, కోడెలని పట్టించుకోలేదని, ఓడిపోయాక ఆయన మొహం కూడా చూడలేదంటూ మాట్లాడారు. ఇలా కొన్ని రోజులు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక మే 2 న కోడెల జయంతి కావడంతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. అయితే కోడెలని అంబటి కూడా మరిచిపోకుండా నివాళి అర్పించారు.

 

ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి, అనేక పదవులు నిర్వహించిన అరుదైన నాయకుడు కోడెల శివప్రసాద్‌రావు అని అన్నారు. ఇక ఓటమి చెందిన తర్వాత కోడెల పట్ల బాబు దుర్మార్గ వైఖరే ఆత్మహత్యకు కారణమన్నారు. వెన్నుపోటు పొడవడం, దండేసి పొగడటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇదే సమయంలో అంబటి కోడెల హత్యకు సంబంధించి ఓ కీలక పాయింట్ లాగారు. అసలు కోడెల శివప్రసాద్ సెల్‌ఫోన్ ఏమైందని, దాన్ని ఫార్మాట్ చేయకుండా బయటపెట్టాలని డిమాండ్ చేసారు.

 

బాబు పదే పదే కోడెల హత్యకు వైసీపీనే కారణమంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, అంబటి ఈ పాయింట్ తెరమీదకి తీసుకొచ్చి, కోడెల కేసులో మళ్ళీ కదలిక తీసుకొచ్చారు. మరి చూడాలి అంబటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుందో? లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: