యాపిల్ అన‌గానే క‌శ్మీర్ గ‌ర్తుకు వ‌స్తుంది. కానీ.. ఇప్పుడు తెలంగాణ యాపిల్ కూడా వ‌స్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో న‌మోదు అయ్యే అతిత‌క్కువ ఉష్ణోగ్ర‌త‌ల‌ను త‌న‌కు అనుకూలంగా  ఓ రైతు చేస్తున్న ప్ర‌యోగం స‌క్సెస్ అయింది. తెలంగాణ‌ రాష్ట్రంలోనూ యాపిల్ పంట పండుతోందని నిరూపించాడు. ఇక‌ తొలిసారిగా తెలంగాణ‌ యాపిల్‌ మార్కెట్‌లోకి రానున్నది. సహకారంతో కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు కేంద్రె బాలాజీ 400 మొక్కలు నాటగా, మరో నెలరోజుల్లో పంట చేతికందనున్నది. స్నేహితుడు ఇచ్చిన‌ సలహాతో రాజమండ్రిలోని ఓ నర్సరీ నుంచి బాలాజీ పది యాపిల్‌ మొక్కలు తీసుకొచ్చి నాటాడు. తనకున్న పరిజ్ఞానంతో వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించగా ఏపుగా పెరిగాయి. ఉష్ణ మండల ప్రాంతాల్లో యాపిల్‌ సాగుపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసింది.

 

బాలాజీ యాపిల్‌సాగు చేస్తున్న భూమిని, అక్కడి వాతావరణాన్ని ప‌రిశీలించారు. 2014లో ఈ భూమిలో సాగుకు అనుకూలమైన హరిమన్‌ రకానికి చెదిన 150 మొక్కలను ఇచ్చి ప్రోత్సహించారు. వారి సలహాలతో ముందుకు వెళ్లాడు. 50 మొక్కలు చనిపోగా, 100 మొక్కలు పెరిగాయి. రెండో ఏట పూతవచ్చి కాయలు కాశాయి. 2016లో వ్యవసాయశాఖ మరో 300 మొక్కలు ఇవ్వగా నాటాడు. మూడేండ్లుగా కాయలను కోయకుండా చెట్టుకు అలాగే వదిలేశాడు. ప్రస్తుతం కాయలు 200 గ్రాముల పరిమాణానికి చేరాయి. రెండెకరాల్లో 400 చెట్లలో ఒక్కోదానికి 20 నుంచి వరకు 40 కాయలున్నాయి.

 

మరో నెలలో కోతకు వచ్చేసరికి ఒక్కొక్కటి 250 గ్రాముల బరువు వచ్చే అవకాశం ఉన్నది. ధనోర పరిసరాల్లో సాగవుతున్న యాపిల్‌ క్షేత్రం చుట్టూ గుట్టలు ఉన్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలో ఈ ప్రాంతంలో 4 నుంచి 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల యాపిల్‌ సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు వీరభద్రరావ్‌, రమేశ్‌ అటర్వాల్‌ తెలిపారు. ఈ రైతును ఆద‌ర్శంగా తీసుకుని మ‌రికొంద‌రు కూడా యాపిల్ తోట‌ల సాగుకు ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: