తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్య, ఉద్యోగం, పర్యాటకం, ఇతర కారణాల వల్ల సొంత ప్రాంతానికి వెళ్లలేక చిక్కుకుపోయినవారికి శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సొంత ప్రాంతానికి వెళ్లలేని వారి కోసం పోలీసులు ఈ పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా సొంత ఊరు, సొంత రాష్ట్రం వెళ్లాలనుకుంటే https://tsp.koopid.ai/epass లింక్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

పోలీస్ ఉన్నతాధికారులు ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్ మాత్రమే జారీ చేస్తామని చెబుతున్నారు. ఎవరైతే సొంత ఊరు, సొంత రాష్ట్రానికి వెళ్లాలనుకుంటారో వారు పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ప్రాంతం, ఇతర వివరాలను పొందుపరచాలి. వివరాలను పరిశీలించి ఆన్ లైన్ లోనే పాసులు జారీ చేస్తామని డీజీపీ తెలిపారు. ఈ పాసుల సహాయంతో సొంత ప్రాంతాలకు వెళ్లవచ్చని తెలిపారు.

 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న 17 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1061కు చేరింది. నిన్న ఒకరు మృతి చెందటంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 29కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 533 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో 499 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న నమోదైన కేసుల్లో 15 కేసులు హైదరాబాద్ నగరంలో నమోదు కాగా 2 కేసులు రంగారెడ్డి పరిధిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో కరోనా తగ్గుముఖం పట్టలేదు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల సడలింపుకు సిద్ధమైంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: