డ్రాగ‌న్ కంట్రీ చైనాలో చెప్పేదొక‌టి...చేసేది ఒక‌టి అనేది స్ప‌ష్టం అవుతోంది. కొవిడ్‌-19 వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌ నగరంలో ప‌రిస్థితులు దీనికి అద్దం ప‌డుతున్నాయి. కొవిడ్‌-19 కేసులు క్రమంగా తగ్గాయని తెలుసుకున్న అధికారులు 76 రోజుల అనంతరం ఏప్రిల్‌ 8న వుహాన్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. ఈ నగరంలో ప్రజలు ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారని అక్కడి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వైరస్‌ మరోసారి విరుచుకుపడొచ్చనే ఆందోళన ఆ నగరాన్ని పట్టిపీడిస్తోంది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం స‌హాయం మాత్రం అంతంత మాత్ర‌‌మేనని అంటున్నారు.

 


కరోనా సృష్టించిన విలయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఇళ్ల‌ నుంచి బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. లాక్ డౌన్ త‌ర్వాతి మరుసటి రోజు నుంచి ప్రజలు  వీధుల్లోకి వస్తారని, నగరంలో దుకాణాలు తెరుచుకుంటాయని, వాణిజ్య కార్యకలాపాలు పునఃప్రారంభం అవుతాయని భావించారు. అయితే, వాళ్లు అనుకున్నట్టు ఏమీ జరుగలేదు. నగరంలో ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ చాలావరకు దుకాణాలు తెరుచుకోలేదు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి స్థానికులు భయపడుతున్నారు. మాస్కులు ధరించి చాలా కొద్ది మంది మాత్రమే వీధుల్లోకి వస్తున్నారు. నిర్ణీత దూరం వంటి పద్ధతుల్ని  పాటిస్తున్నారు. కస్టమర్లు రాకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. నగరంలో తెరుచుకున్న కొద్దిపాటి రెస్టారెంట్లు కూడా పార్సిల్‌ సర్వీసులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

 

మూడు నెలలపాటు చిన్న వ్యాపారులకు అద్దెను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దుకాణం యజమానులు, బిల్డింగుల ఓనర్లు ఊరుకోవడంలేదు. కొనుగోలుదారులు రాకపోవడం, వ్యాపారాలు సాగకపోవడం, అద్దె కోసం యజమానుల ఒత్తిళ్లు వెరసి నగరంలో చాలా వరకు వ్యాపారస్థులు తమ దుకాణాల్ని తెరువడం లేదు. ప్రభుత్వ సాయం అందడానికి చాలా సమయం పడుతుందని భావించిన మరికొందరు తమ దుకాణాలు, రెస్టారెంట్లను మూసివేస్తున్నారు. వైరస్‌ భయంతో ప్రజలు కొనుగోళ్లకు భయపడుతున్నారని, వుహాన్‌ అభివృద్ధిపై వైరస్‌ ప్రభావం మూడేండ్ల వరకూ ఉండొచ్చని మెక్వైరీ క్యాపిటల్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన ఆర్థికవేత్త ల్యారీ హూ తెలిపారు. నగరంలో మొదట ఉత్పాదక రంగం పుంజుకుంటుందని, ఆతర్వాత కొనుగోళ్లలో వృద్ధి కనిపించవచ్చని అంచనా వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: